రుణమాఫీ కాలేదని వేల సంఖ్యలో రైతులు ఫోన్లు చేస్తున్నారు

రుణమాఫీ కాలేదని వేల సంఖ్యలో రైతులు ఫోన్లు చేస్తున్నారు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ ​రెడ్డి విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. కిషన్​రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’, స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించి కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్న ఆయన, దీనికి వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్‌ చేసి చెబుతున్నారని, రుణమాఫీ కాకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. రుణమాఫీకి ప్రాతిపదిక ఏంటో తెలియట్లేదని రైతులు చెబుతున్నట్లు వివరించారు.

వచ్చే నాలుగన్నరేళ్లు బీజేపీ నేతలు కష్టపడి పని చేయాలన్న కేంద్ర మంత్రి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 36 శాతం ప్రజలు ఓట్లు వేశారని గుర్తు చేశారు. ప్రజల తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేయాలని నేతలకు సూచించారు. ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

కాగా, పంట రుణమాఫీ పథకం అమలు సమయంలో 30 వేల రైతుల ఖాతాల్లో సమస్యలు గుర్తించామని టెస్కాబ్‌ (తెలంగాణ స్టేట్‌ కో- అపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకు) ఎండీ డాక్టర్‌ బి.గోపి తెలిపారు. లోన్‌ అకౌంట్‌ మనుగడలో లేకపోవడం, ఆధార్‌ మ్యాపింగ్‌ కాకపోవటం, బ్యాంకు ఖాతా- ఆధార్‌ వివరాలకు పోలికలేకపోవటం లాంటి సమస్యలున్నాయని వివరించారు. ఈ మేరకు రైతుల నుంచి ఫిర్యాదులు కూడా వచ్చాయని చెప్పారు.