రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్‌ అనర్హత … ప్రధాని మోదీ ఆందోళన

రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్‌ అనర్హత … ప్రధాని మోదీ ఆందోళన
పారిస్ ఒలింపిక్స్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకునే అవ‌కాశాన్ని రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ చేజార్చుకున్న‌ది. ఓవ‌ర్ వెయిట్ కార‌ణంగా ఆమెను అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ఇవాళ ఆమె గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్ ఆడాల్సి ఉన్న‌ది.  అయితే వినేశ్ ఫోగ‌ట్ అనర్హత అయిన నేప‌థ్యంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. వినేశ్‌, నువ్వ చాంపియ‌న్ల‌కే చాంపియ‌న్‌ అంటూ ఆయ‌న ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు. భార‌త దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి ప్రేర‌ణ‌గా నిలుస్తున్నావ‌ని తెలిపారు.

నిజానికి వేటు ప‌డ‌డం అది ఎంతో బాధిస్తుంద‌ని చెప్పారు. చాలా నిరాశ‌కు లోన‌య్యాన‌ని, ఆ విష‌యాన్ని మాట‌ల్లో చెప్ప‌లేమ‌న్నారు. నువ్వు మ‌రింత ప‌ట్టుద‌ల‌తో రాణిస్తావ‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం నీ నైజ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌రింత బ‌లంతో పుంజుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నీకు మేం అంద‌రం మద్దతుగా ఉంటామ‌ని మోదీ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

50 కేజీల ఫ్రీ స్ట‌యిల్ రెజ్లింగ్‌లో పోటీ చేసిన వినేశ్ ఫోగ‌ట్‌ ఫైన‌ల్‌కి ప్ర‌వేశించింది. కానీ సుమారు 100 గ్రాముల అధిక బ‌రువు న‌మోదు కావ‌డంతో ఆమెపై వేటు విధించారు. దీంతో భార‌త ఒలింపిక్ బృందంలో నిరాశ‌లు నెల‌కొన్నాయి. వినేశ్ విష‌యంలో భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు పీటీ ఉష‌తో ప్ర‌ధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. అస‌లు ఏం జ‌రిగిందో ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. అంత‌ర్జాతీయ ఒలింపిక్ సంఘం వ‌ద్ద త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని పీటీ ఉష‌ను మోదీ కోరిన‌ట్లు తెలుస్తోంది. 

ఫొగాట్‌పై అనర్హత వేటు అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభలో లేవనెత్తారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. స్పందించిన ప్రభుత్వం వినేశ్‌ ఫొగాట్‌ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. వినేశ్ పోగ‌ట్‌పై వేటు వేసిన ఘ‌ట‌న‌లో సాంకేతిక కార‌ణాల‌పై అన్వేష‌ణ చేప‌ట్టాల‌ని  స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ డిమాండ్ చేశారు. దాని వెనుక ఉన్న అస‌లైన కార‌ణం బ‌య‌ట‌కు రావాలని స్పష్టం చేశారు.

రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టిస్తుందని అనుకుంటే.. సరిగ్గా చారిత్రక బౌట్ కు కొన్ని గంటల ముందు ఆమె అనర్హతకు గురి కావడం ప్రతి భారతీయుడి గుండె పగిలేలా చేసింది. అయితే రాత్రికి రాత్రి తాను పెరిగిన బరువు తగ్గడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. తిండి మానేసి, స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటివి చేయడంతోపాటు జుట్టు కత్తిరించుకోవడం, రక్తం బయటకు తీయడంలాంటి తీవ్రమైన చర్యలకు కూడా పాల్పడింది.

అయినా చివరికి 150 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు  గురైంది. అయితే ఇవన్నీ చేయడంతో డీహైడ్రేషన్ కు గురైంది. ఆమె అక్కడే కళ్లు తిరిగి పడిపోవడంతో ఒలింపిక్స్ విలేజ్ లోనే వినేశ్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బాగానే కోలుకుంటుందని, విశ్రాంతి తీసుకుంటుందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఒలింపిక్స్ లో ఇలా ఫైనల్ కు ముందు అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన తొలి రెజ్లర్ గా వినేశ్ నిలిచింది.