గోల్డ్ మెడల్ వైపు నీరజ్ చోప్రా తొలి అడుగు

గోల్డ్ మెడల్ వైపు నీరజ్ చోప్రా తొలి అడుగు

* సెమీస్‌లో భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్

టోక్యో ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణంతో మెరిసిన‌ నీర‌జ్ చోప్రా పారిస్‌లోనూ దుమ్మురేపాడు. విశ్వ‌క్రీడ‌ల జావెలిన్ త్రో పోటీల్లో వ‌రుస‌గా రెండోసారి ఫైన‌ల్‌కు దూసుకెళ్లాడు. మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో నీర‌జ్ ఈటెను 89.34 మీట‌ర్ల దూరం విసిరాడు. తొలి ప్ర‌య‌త్నంలోనే అంత దూరం బ‌డిసెను విసిరి ప‌త‌కం వేట‌లో అడుగు ముందుకేశాడు. చోప్రాకు ఇది కెరీర్‌లోనే రెండో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం విశేషం. 
 
డిఫెండింగ్ చాంపియ‌న్ నీర‌జ్ చోప్రా ఒలింపిక్స్‌లో మ‌రోసారి అదిరే ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. నాలుగేండ్ల క్రితం టోక్యోలో (87.58  మీట‌ర్ల) ప‌సిడి పత‌కంతో ఈ బ‌డిసె వీరుడు చ‌రిత్ర సృష్టించాడు. విశ్వ క్రీడ‌ల్లో గోల్డ్ మెడ‌ల్ కొల్ల‌గొట్టిన తొలి భార‌త‌ అథ్లెట్‌గా రికార్డు పుట‌ల్లోకి ఎక్కాడు. ఇప్పుడు పారిస్‌లోనూ నీర‌జ్ స‌త్తా చాటాడు. 
భార‌త ప‌త‌కాల సంఖ్య మూడు వ‌ద్దే ఆగిపోయ‌న సంద‌ర్భంలో కోట్లాది మంది ఆశ‌ల‌ను మోస్తున్న అత‌డు అంచనాల‌కు త‌గ్గ‌ట్టు రాణించాడు. క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో ఈటెను 89.34 మీట‌ర్ల దూరం విసిరాడు. దాంతో, ఒలింపిక్స్‌లో వ‌రుస‌గా రెండోసారి ఫైన‌ల్ బెర్త్ సంపాదించాడు. సాధించాడు.
 
కాగా, భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ విశ్వ క్రీడ‌ల్లో అద‌ర‌గొడుతోంది. 16వ రౌండ్‌లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1ను చిత్తు చేసిన వినేశ్ క్వార్ట‌ర్స్‌లోనూ జోరు చూపించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. 50 కిలోల విభాగం క్వార్ట‌ర్ ఫైన‌ల్లో వినేశ్‌ ఉడుం ప‌ట్టుతో ఉక్రెయిన్ రెజ్ల‌ర్ ఒక్సానా లివాచ్‌ ను మ‌ట్టిక‌రిపించింది.  ఆరంభం నుంచి ప్ర‌త్య‌ర్థిని ముప్ప‌ తిప్ప‌లు పెట్టిన భార‌త రెజ్ల‌ర్ 7-5తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. దాంతో, ఇండియాకు క‌నీసం కాంస్యం ఖ‌రారు చేసింది. ఫైన‌ల్ బెర్తు కోసం ఆమె రాత్రి 10:15 గంట‌ల‌కు త‌ల‌ప‌డ‌నుంది.