సెప్టెంబర్‌లో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు

సెప్టెంబర్‌లో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు
జమ్మూ కశ్మీర్‌లో సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగేందుకు, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఐదేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసిందని గుర్తు చేశారు. 
 
దాంతో జమ్మూ కశ్మీర్‌లో పాక్‌, గూఢచార సంస్థ, ఐఎస్‌ఐ కార్యకలాపాలు చాలా వరకు అరికట్టగలిగామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డిని బీజేపీ అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదో వార్షికోత్సవం సందర్భంగా జమ్మూలోని బానా సింగ్ స్టేడియంలో పార్టీ నిర్వహించిన ‘ఏకాత్మ మహోత్సవ్’ పాల్గొని, ఆయన ప్రసంగించారు. 
 
ఆయన ప్రసంగిస్తూ.. సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆర్టికల్ 370ని రద్దు చేసి, బీజేపీని పొడిగిస్తూ వచ్చిన మార్పులను చూసి ప్రజలు బీజేపీని పూర్తి మెజారిటీతో అధికారంలోకి తీసుకువస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు, స్థిరమైన శాంతిభద్రతలు నెలకొనేందుకు వచ్చే ఎన్నికలలో బిజెపికి ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రసంగించిన బీజేపీ నాయకులు పిలుపిచ్చారు.
 
అబ్దుల్లా కుటుంభం, పాకిస్థాన్ కారణంగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో యిబ్బందులను ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ నాయకత్వం కారణంగా అభివృద్ధి ఆగిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రాంతం కోసం డా. శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం చేయగా, మొత్తం దేశ ప్రజలు ఇక్కడి ప్రజలకు మద్దతుగా నిలబడ్డారని గుర్తు చేశారు.
దేశం మొత్తం అమలులోకి వచ్చిన అంబెడ్కర్ రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ లో అమలులోకి రాలేదని, కేవలం ఆర్టికల్ 370 రద్దు తర్వాతనే అమలులోకి వచ్చిందని ఆయన తెలిపారు.  బిజెపి ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రవీందర్ రైనా, జాతీయ కార్యదర్శి డా. రవీందర్ సింగ్ రైనా తదితరులు కూడా ప్రసంగించారు.
ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువులోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలను సమీక్షించేందుకు ఈసీ బృందం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్‌లో పర్యటించబోతున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు అక్కడ పర్యటించనున్నారు. 
 
మొదట రాజకీయ పార్టీలతో తొలుత కమిషన్ సమావేశం కానున్నది. సీఈవో, ఎస్పీఎన్‌వో, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేటర్‌తోనూ సమీక్షించనున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కమిషన్ సమావేశమై ఎన్నికల సహకాలపై సమీక్షించనున్నారు. ఈ నెల 10న జమ్మూలో పర్యటించి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశమై.. ఆ తర్వాత మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నది.