మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఎల్‌కే అద్వానీ

మళ్లీ ఆసుపత్రిలో చేరిన ఎల్‌కే అద్వానీ

బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. న్యూరాలజీ విభాగం వైద్యులు ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి.

‘బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ ఈరోజు ఉదయం ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో చేరారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆయన్ని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు’ అని అపోలో హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అద్వానీ వయసు 96 ఏళ్లు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతోనే ఆయనను దవాఖానలో చేర్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాగా, రెండు నెలల వ్యవధిలోనే అద్వానీ ఆసుపత్రిలో చేరడం ఇది మూడోసారి. తొలుత జూన్‌ 26న అద్వానీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్‌ అయ్యారు. జులై 3న మరోసారి ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆయన్ని ఎయిమ్స్‌కి తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో చేరడంతో.. అద్వానీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.