
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ నామినేషన్ విషయంలో స్థానిక ప్రభుత్వం సలహా తీసుకోవాల్సిన అవసరం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 10 మంది సభ్యుల్ని మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ అవసరం లేదని పేర్కొంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నుంచి ఈ అధికారం వచ్చిందని, కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ స్థానిక ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆయనకు చట్ట ప్రకారం ఆ అధికారం లభించిందని తేల్చి చెప్పింది.
2022 డిసెంబర్‌లో జరిగిన డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి 134 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 104 వార్డుల్లో గెలిచింది. ఆప్ తరఫున మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌ను కేజ్రీవాల్ ప్రతిపాదించగా, బీజేపీ తరఫున రేఖా గుప్తా మేయర్ బరిలో నిలిచారు.
డిప్యూటీ మేయర్ పదవికి ఆప్ ఆలే మహ్మద్ ఇక్బాల్‌ను, బీజేపీ రామ్‌నగర్ కౌన్సిలర్ కమల్ బగ్రీని నిలబెట్టాయి. అయితే మేయర్ ఎన్నిక కోసం జరిగిన ఓటింగ్‌లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. అలా పలుమార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
చివరగా ఓటింగ్ జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) మేయర్‌గా ఎన్నిక జరిగి షెల్లీ ఒబెరాయ్ నియామకం అయ్యారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్ చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించడం వల్ల వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆప్ ఆశ్రయించగా తాజాగా తీర్పును ఇచ్చింది. సుప్రీం తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు