
బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు అదుపుతప్పి హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 14మంది పోలీసులతో సహా 100 మంది ప్రాణాలు వదిలారు. వందలాది మంది గాయాలకు గురయ్యారు.
ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హోంమంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం నుండి దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించడంతో పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మొబైల్ ఇంటర్‌నెట్ సేవలను సైతం నిలిపివేశారు. షేక్ హసీనా తన వ్యక్తిగత నివాసం గణభబన్‌లో భద్రతా వ్యవహారాలపై జాతీయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారు విద్యార్థులు కాదు ఉగ్రవాదులని, గట్టి సమాధానం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, సెక్యూరిటీకి సంబంధించిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని భద్రతా సలహాదారు కూడా ఉన్నారు. హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులను ప్రకటించింది.
కాగా, బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారత విద్యార్థులు, పౌరులు భారత హై కమిషన్‌తో టచ్‌లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తాము ఇచ్చిన ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అసిస్టెంట్ హై కమిషన్ ఎక్స్‌లో విజ్ఞప్తి చేసింది.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. శనివారం ప్రధాని షేక్ హసీనా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశమయ్యారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చల కోసం తన ప్రైవేట్ నివాసానికి పిలిచారు. అయితే, ఆందోళనకారులు ప్రధానితో ఎలాంటి చర్చలకు నిరాకరించారు. షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఆందోళనకారులు కర్రలు చేతబూని ప్రైవేట్ కార్లు, అంబులెన్స్‌లు, బస్సులు, బైక్‌లు, ఇతర వాహనాలను ధ్వంసం, దగ్ధం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లపై అధికార పార్టీ నేతల నివాసాలు, కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. వారు దవాఖానలపై కూడా దాడులు చేయడంతో రోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
More Stories
ఆసియా కప్ 2025లో పాక్ ను మట్టికరిపించిన భారత్
వరద బాధిత నిధులను ఉగ్రవాదులకు మళ్లించిన పాక్
సిక్కు మహిళపై లైంగిక దాడిని ఖండించిన బ్రిటిష్ ఎంపీ