అన్ని పంటలకు మద్దతు ధరలు ఇస్తున్న మొదటి రాష్ట్రంగా హర్యానా

అన్ని పంటలకు మద్దతు ధరలు ఇస్తున్న మొదటి రాష్ట్రంగా హర్యానా
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆదివారం రాష్ట్రంలోని అన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తద్వారా అన్ని పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా హర్యానా అనిలిచింది. కాలువ నీటి పారుదల ఛార్జీల బకాయిలు రూ.133 కోట్లు మాఫీ చేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.
 
రాష్ట్రంలో పార్టీ తన ప్రచారాన్ని ప్రారంభించిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకునేందుకు కీలక అప్రకటనలు చేశారు. పార్టీ ‘విజయ్ శంఖనాద్’ ర్యాలీని ఉద్దేశించి సైనీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం 14 పంటలను మద్దతు ధరతో సేకరిస్తుందని, ఈ రోజు నుండి అన్ని పంటలకు కూడా మద్దతు ధరను వర్తింప చేస్తామని వెల్లడించారు. 
 
అంతేకాకుండా, సైనీ మునుపటి అబియానా నుండి బకాయి ఉన్న రూ. 133.55 కోట్లను మాఫీ చేయడం ద్వారా రైతులకు గణనీయమైన ఉపశమనాన్ని ప్రకటించారు. అదే సమయంలో, అబియానాను నిలిపివేయడం ద్వారా రైతులకు ఏటా సుమారు రూ.54 కోట్ల ఉపశమనం ప్రకటించారు.
 
రోహ్‌తక్, నుహ్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో 2023కి ముందు సంభవించిన విపత్తుల వల్ల నష్టపరిహారం కోసం పెండింగ్‌లో ఉన్న రూ.137 కోట్లను సంబంధిత రైతులకు వారంలోగా డిప్యూటీ కమిషనర్లు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కొత్త ట్యూబ్‌వెల్ కనెక్షన్‌ల కోసం దేశంలో ఎక్కడి నుంచైనా రైతులు త్రీస్టార్ మోటారు కొనుగోలు చేసుకునేందుకు వీలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10 కంపెనీల త్రీస్టార్ మోటార్లు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పుడు దేశంలో త్రీ-స్టార్ మోటార్లు తయారు చేస్తున్న అన్ని కంపెనీలు హర్యానా ప్యానెల్‌లోకి వస్తాయి.  ఈ చర్య డిసెంబర్ 31, 2023 వరకు కొత్త ట్యూబ్‌వెల్ కనెక్షన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని సైనీ అన్నాతెలిపారు. బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న విధానాలు, చేస్తున్న పనులను వివరించేందుకు ప్రతిజ్ఞ చేయాలని బీజేపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.