
ప్రకృతి మిగిల్చిన విలయంతో వయనాడ్ మరుభూమిగా మారిపోయింది. ఎటుచూసినా శిథిలాలతో విషాద దృశ్యాన్ని తలపిస్తున్నది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. చలియార్ నదిలో శవాలు కొట్టుకొస్తూనే ఉన్నాయి. వందలాది ఇండ్ల ఆనవాళ్లే కనిపించడం లేదు. ఇప్పటికీ వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ దొరకడం లేదు.
అనేక ఇండ్లు బురదలో మునిగిపోయాయి. ముండక్కై, చూరల్మల, మెప్పడిలో ఎటుచూసినా హృదయవిదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటివరకు 287 మృతదేహాలు లభ్యమయ్యాయి. చలియార్ నదిలో కొట్టుకువచ్చిన 83 మృతదేహాలను బయటకు తీశారు.
ఇప్పటికీ అధికారికంగా 240 మంది ఆచూకీ దొరకడం లేదు. 191 మంది తీవ్ర గాయాలతో వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే విరిగిపడ్డ కొండచరియలను చాలావరకు తొలగించలేదు. అనేక ఇండ్లలోకి సహాయక సిబ్బంది చేరుకోలేదు. దాదాపు 500 ఇండ్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో, మృతులు, గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది.
గురువారం ఉదయం గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనాస్థలి నుంచి ప్రజలను రక్షించేందకు సహాయక బృందాలు తాత్కాలిక వంతెనలు నిర్మించారు. మరోవైపు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ గురువారం పర్యటించనున్నారు.
ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది బాధితులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముండక్కై, చూరల్మల మధ్య వంతెన కూలిపోవడం సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఆర్మీ సిబ్బంది తాత్కాలిక వంతెనను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నారు.
చిన్న వరద ప్రవాహాల మీదుగా అప్పటికప్పుడు కూలిన చెట్లు, ఇసుక బస్తాలతో తాత్కాలిక వంతెనలు వేసి బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు బెయిలీ అనే తాత్కాలిక వంతెనలను నిర్మించారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి వీటి ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాలకు ఈ పోర్టబుల్ వంతెన నిర్మాణానికి కావాల్సిన పరికరాలను ఢిల్లీ, బెంగళూరు నుంచి తెప్పించారు. వీటిలో ఉపయోగించే పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా తరలించవచ్చు. వాటిని ఉపయోగించడానికి ప్రత్యేక టూల్స్ అవసరం ఉండదు.
ప్రకృతి విపత్తు సమయంలో తాత్కాలిక నడక మార్గాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక ఆర్మీ బృందం ఈ వంతెనల నిర్మాణం చేపట్టిందని కేరళ మంత్రి కె రాజన్ మీడియాకు వెల్లడించారు. ఇక, మెప్పడిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిబిరాల్లోని బాధితులకు సేవలందిస్తున్నారు.
కేరళలో ఏడు నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పెరిగిందని సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించింది. ఏడు నదులకు సంబంధించి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో ఐదు నదులకు సంబంధించి యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నదుల పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం వయనాడ్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిల సమావేశం జరగనుందని జిల్లా యంత్రాంగం తెలిపింది.
తమ రాష్ట్రంలో ఇటువంటి విషాదాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మండక్కై, చూరాల్మల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో తాత్కాలిక వంతెనను శుక్రవారం నాటికి పూర్తి చేస్తాం. రెండు రోజుల సహాయక చర్యల్లో 1,592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 219 మందిని ఆసుపత్రుల్లో చేర్చాం. వారిలో 78 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిని పునరావాస శిబిరాలకు తరలించాం”. అని ముఖ్యమంత్రి తెలిపారు.
More Stories
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్