
* హిమాచల్ లో 32 మంది గల్లంతు
దేశ రాజధాని ఢిల్లీలో వాన దంచి కొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 11.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఘాజీపూర్‌లో చిన్నారి సహా ఓ 22 ఏండ్ల మహిళ కాలువలో మునిగి చనిపోయింది
రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తప్పనిసరి ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. గాజిపూర్ కాల్వలో పడి తల్లీబిడ్డ మృతిచెందగా, సబ్జీమండిలో ఓ ఇల్లు కూలి పలువురు గాయపడ్డారు. రోడ్లపై పెద్దమొత్తంలో వాననీరు నిలవటం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 10విమానాలను దారి మళ్లించారు. అటు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణాతోపాటు కర్ణాటకలోని కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి.
భారీ వానలతో నగరంలోని పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారిమళ్లించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో స్కూళ్లు, విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు రెడ్ అలర్డ్ జారీచేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజల బయటకు రాకూడదని సూచించింది. బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 7.15 గంటల వరకు మయూర్ విహార్‌లోని సల్వాన్ స్కూల్ వద్ద అత్యధికంగా 147.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపింది.
నోయిడాలో 147.5 మి.మీ., గురుగావ్‌లో 119.5 మి.మీ., నజఫ్గఢ్లో 113 మి.మీ., లోధీ రోడ్లో 107.5 మి.మీ., ఢిల్లీ యూనివర్సిటీ వద్ద 104.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది పేర్కొంది. కాగా, రాజేందర్‌నగర్ మరోసారి నీటమునిగింది. వరద నీటిలోనే సివిల్స్ అభ్యర్థులు తమ నిరసనను కొనసాగించారు. ఓల్డ్ రాజేందర్‌నగర్‌లోని రావూస్ ఐఏఎస్ అకాడమీలోని సెల్లార్ నీటమునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే.
మరోవంక, హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా జిల్లాలోని రామ్‌పూర్‌లో సమేజ్ ఖాడ్ వద్దనున్న హైడ్రో ప్రాజెక్ట్ సమీపంలో మేఘ విస్పోటనం కారణంగా ఒకరు మృతి చెందగా.. 32 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కాశ్యప్ వెల్లడించారు. అందుకోసం ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ రంగంలోకి దింపామని వివరించారు. ఇక కూలులో ఈ రోజు తెల్లవారుజామున ఓ భవనం కుప్పకూలి.. పార్వతీ నదిలో కొట్టుకుపోయిందని తెలిపారు.
More Stories
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్‌లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం