తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ చేసిన జిష్ణుదేవ్‌ వర్మ

తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ చేసిన జిష్ణుదేవ్‌ వర్మ

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పలువురు కిషన్‌రెడ్డి సహా మంత్రులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ, రాష్ట్ర ప్రజానీకానికి తన సందేశాన్ని అందించారు. తనకు రాష్ట్ర గవర్నర్‌గా అవకాశం కల్పించిన భారత రాష్ట్రపతికి, ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. త్రిపుర నుంచి వచ్చిన తాను, గొప్ప సంస్కృతి, సుసంపన్నమైన వారసత్వ సంపద, సారవంతమైన నేలలతో దేశ నడిబొడ్డున ఉన్న తెలంగాణకు సేవ చేయడం గర్వంగా ఉందని తెలిపారు.

తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతమన్న ఆయన, వ్యాపారాలకు సైతం కేంద్రబిందువుగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, మంచి మంత్రివర్గం ఉందని, వారితో కలిసి రాష్ట్ర అభ్యున్నతికి పాటు పడుతానని తెలిపారు. సుస్థిర ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అంశాల్లో తెలంగాణను అగ్రగామిగా ఉంచేందుకు అందరితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.

యువతకు మంచి విద్య, ఉద్యోగావకాశాలు కల్పించేలా కృషి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.  సామాజిక న్యాయం చివరి వ్యక్తికి సైతం అందాలన్న గవర్నర్, ఐక్యతతో ఉంటూ సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ సమాజానికి తన పిలుపునిచ్చారు.

గవర్నర్‌గా రాజ్యాంగ విలువలకు కట్టుబడి, పారదర్శకంగా తన విధులు నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. అంతకుముందు మధ్యాహ్నం అగర్తలా నుంచి బయలుదేరిన గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయంలో మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి ఘనస్వాగతం పలికారు. రాజ్‌భవన్‌లో సందడి వాతావరణం నడుమ ప్రమాణ స్వీకార ఘట్టం పూర్తయింది.

ఇదిలా ఉండగా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వారు కాగా, రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 1990లో బీజేపీలో చేరారు. 
 
ఆయన అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు గవర్నర్‌ పదవిని కట్టబెట్టింది.