త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌

త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌
ప్రపంచంలో మనం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదిగామని, భారత్‌ త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఆవిర్భవిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ  ఆశాభావం వ్యక్తం చేశారు. భారత పరిశ్రమలను నూతన శిఖరాలకు చేర్చామని తెలిపారు.  వికసిత్‌ భారత్‌ దిశగా ప్రస్ధానం అనే అంశంపై కేంద్ర బడ్జెట్‌ 2024-25పై సీఐఐ నిర్వహించిన సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేస్తూ పధకాలను పూర్తి చేసేందుకు గత ప్రభుత్వాలు శ్రద్ధ కనబరచలేదని దుయ్యబట్టారు.
 
దేశ అభివృద్ధికి మూలధన వ్యయం కీలకమని చెబుతూ 2004లో యూపీఏ తొలి బడ్జెట్‌లో మూలధన వ్యయం కేవలం రూ. 90,000 కోట్లు కాగా, ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 11 లక్షల కోట్లు పైగా మూలధన వ్యయం వెచ్చిస్తోందని, ఈ నిధులతో దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 
 
ఇవాళ మనం వికసిత్‌ భారత్ దిశగా పయనిస్తున్నామని, ఈ మార్పు కేవలం సెంటిమెంట్లతో రాలేదని, ఆత్మవిశ్వాసంతోనే ఇది సాధ్యమైందని ప్రధాని స్పష్టం చేశారు.  2014కు ముందు యూపీఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధ మెరుగ్గా ఉందని చూపేందుకు బడ్జెట్‌లో భారీ ప్రకటనలు గుప్పించేదని, క్షేత్రస్ధాయిలో వాటి అమలును పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 
 
గత పదేండ్లుగా తాము ఆ పరిస్ధితిని మార్చివేశామని ప్రధాని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే తాము రైల్వే బడ్జెట్‌ను 8 రెట్లు పెంచామని, హైవేల బడ్జెట్‌ను 8 రెట్లు, వ్యవసాయ బడ్జెట్‌ను 4 రెట్లు పెంచామని తెలిపారు. రక్షణ బడ్జెట్‌ను రెండింతలు పైగా పెంచామని చెప్పుకొచ్చారు.  యూపీఏ హయాంలో లక్షలాది కోట్ల రూపాయల విలువైన అవినీతి కుంభకోణాలు వెలుగుచూసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము శ్వేతపత్రం రూపంలో దేశ ఆర్ధిక వ్యవస్ధ ముఖచిత్రాన్ని దేశ ప్రజల ముందుంచామని చెప్పారు. మనం ఎక్కడ ఉన్నామనేదానిపై చర్చ జరగాలని చెప్పారు.
 
“విక్షిత్ భారత్ తీర్మానాలతో దేశం ముందుకు సాగుతోంది”, గత 10 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని పేర్కొన్న ప్రధాని మోదీ, జీవన సౌలభ్యాన్ని పెంచడానికి, జీవన నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం, సంతృప్త విధానం, జీరో ఎఫెక్ట్-జీరో డిఫెక్ట్‌పై ఉద్ఘాటన, ఆత్మనిర్భర్ భారత్ లేదా విక్షిత్ భారత్ ప్రతిజ్ఞలో ‘నేషన్ ఫస్ట్’ నిబద్ధత ప్రతిబింబిస్తుందని ప్రధాని తెలిపారు. పథకాల విస్తరణ, పర్యవేక్షణపై దృష్టి,  ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. 

“2014లో, రూ. 1 కోటి సంపాదిస్తున్న  ఎంఎస్‌ఎంఈలు ఊహాజనిత పన్ను చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు రూ. 3 కోట్ల వరకు ఆదాయం ఉన్న  ఎంఎస్‌ఎంఈలు కూడా దీని ప్రయోజనాన్ని పొందవచ్చు. 2014లో రూ. 50 కోట్ల వరకు సంపాదిస్తున్న ఎంఎస్‌ఎంఈలు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, నేడు ఈ రేటు 22 శాతానికి చేరుకుంది. 2014లో కంపెనీలు 30 శాతం కార్పొరేట్ పన్నును చెల్లించగా, నేడు రూ. 400 కోట్ల వరకు ఆదాయం ఉన్న కంపెనీలకు ఈ రేటు 25 శాతంగా ఉంది” అని ప్రధాని గుర్తు చేశారు.