ఒకే ఒలింపిక్స్ లో రెండో పతాకంతో చరిత్ర సృష్టించిన మ‌నూ భాక‌ర్

ఒకే ఒలింపిక్స్ లో రెండో పతాకంతో చరిత్ర సృష్టించిన మ‌నూ భాక‌ర్
* భాక‌ర్‌తో పాటు స‌ర‌బ్‌జోత్ సింగ్ కు కాంస్య పతాకం
 
పారిస్ ఒలింపిక్స్‌ లో భారత్ రెండో మెడ‌ల్ గెల్చుకుంది.10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లో భార‌త్‌కు కాంస్య ప‌త‌కం ల‌భించింది. షూట‌ర్ మ‌నూ భాక‌ర్ ఖాతాలో మ‌రో మెడ‌ల్ ప‌డింది. మిక్స్‌డ్ టీమ్‌లో మ‌నూ భాక‌ర్‌తో పాటు స‌ర‌బ్‌జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంట‌పై భార‌త షూట‌ర్లు మేటి ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు.
 
ఈ మెడ‌ల్‌తో షూట‌ర్ మ‌నూ భాక‌ర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. స్వ‌తంత్ర భార‌త్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు సాధించిన అథ్లెట్‌గా మ‌నూ భాక‌ర్ నిలిచారు. ఇదే ఒలింపిక్స్‌లో 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో మ‌నూ భాక‌ర్ కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకున్న విష‌యం తెలిసిందే. యావ‌త్ దేశం గ‌ర్వించ‌ద‌గ్గ రీతిలో మ‌నూ త‌న ట్యాలెంట్ ప్ర‌ద‌ర్శించారు.
 
గ‌తంలో ఇండియా త‌ర‌పున ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ సాధించిన అథ్లెట్ల‌లో నార్మ‌న్ ప్రిచార్డ్ ఉన్నారు. 1900 సంవ‌త్స‌రంలో జ‌రిగిన పారిస్ ఒలింపిక్స్‌లోనే అత‌ను ఆ రికార్డును అందుకున్నాడు. 200 మీట‌ర్ల హార్డిల్స్‌, 200 మీట‌ర్ల రేస్‌లో.. నార్మ‌న్ ప్రిచార్డ్ సిల్వ‌ర్ ప‌త‌కాల‌ను గెలిచారు. హ‌ర్యానాకు చెందిన షూట‌ర్ మ‌నూ మ‌రో చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాలు ఉన్నాయి. ఒకే ఎడిష‌న్‌లో మూడు మెడ‌ల్స్ గెలిచే అవ‌కాశం ఉన్న‌ది. 25 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో మ‌నూ ప్రాతినిధం వ‌హిస్తున్న‌ది.
 
మ‌నూ-స‌ర‌బ్‌జోత్ జ్యోడి ఆరంభంలో త‌డ‌బడ్డా రెండో సిరీస్ నుంచి అద్భుత ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. దాదాపు ప్ర‌తి రౌండ్‌లో ఆధిప‌త్యాన్ని చాటారు. వాస్తవానికి కొరియా చాలా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి. కానీ మ‌నూ ప్ర‌తి రౌండ్‌లోనూ కీల‌క‌మైన పాయింట్ల‌ను సాధించారు. 16-10 పాయింట్ల‌తో మ‌నూ భాక‌ర్ టీమ్ .. కాంస్య ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్న‌ది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని మను బాకర్ అందించింది. 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఈమె కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను రికార్డు సృష్టించింది.  ఫైనల్‌లో మను భాకర్‌ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సౌత్‌కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్‌ యేజే (241.3 పాయింట్లు) రజత పతకాన్ని సాధించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ త‌ర‌పున రెండు ఒలింపిక్స్ ప‌త‌కాలు సాధించిన వాళ్ల‌లో ప్రిచార్డ్‌, సుశీల్ కుమార్‌, పీవీ సింధు, భాక‌ర్ ఉన్నారు. వారిలో ప్రిచార్డ్‌, భాక‌ర్ మాత్రం ఒకే ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు సాధించారు. ఇక సుశీల్‌, సింధులు.. వేర్వేరు ఒలింపిక్స్‌లో ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకున్నారు.  2008 బీజింగ్ ఒలింపిక్స్ లో రెజ్ల‌ర్ సుశీల్ కాంస్యం, 2012 లండ‌న్ ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కాన్ని గెలుచుకున్నారు. ఇక హైద‌రాబాదీ ష‌ట్ల‌ర్ పీవీ సింధు.. 2016 రియో గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్‌, ఆ త‌ర్వాత టోక్యో 2020 గేమ్స్‌లో కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకున్న‌ది.

రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు 

భారత్ కు పతాకం గెల్చుకున్న ఈ జోడి షూటర్‌లు మను భాకర్, సరబ్‌జోత్ సింగ్‌లను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అభినందించారు. భవిష్యత్తులో ఈ జంట షూటర్లు మరెన్నో అవార్డులు పొందాలని ఆమె ఆకాంక్షించారు. “షూటింగ్ కోసం మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారతదేశం కోసం కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మను భాకర్, సరబ్జోత్ సింగ్‌లకు అభినందనలు! ఒకే ఒలింపిక్ క్రీడలలో రెండు పతకాలు సాధించిన భారతదేశం నుండి మొదటి మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆమె మనకు చాలా గర్వకారణం”  రాష్ట్రపతి ఎక్స్ లో ఒక పోస్ట్‌లో రాశారు.

భారత్‌కు మరో పతాకాన్ని అందించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. “షూటర్లు మనల్ని గర్వపడేలా చేస్తున్నారు! ఒలింపిక్స్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మనుబాకర్ అలాగే సరబ్జోత్ సింగ్‌లకు శుభాకాంక్షలు. ఈ ఇద్దరూ అద్భుతమైన నైపుణ్యంతో పాటు జట్టు కృషిని ప్రదర్శించారు. భారత ప్రజలు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక మనుకి ఇది వరుసగా రెండవ ఒలింపిక్ పతకం. ఆమె స్థిరమైన నైపుణ్యంతో పాటు ఆమె అంకితభావాన్ని ప్రదర్శిస్తోంది.” అంటూ మోదీ ట్వీట్ చేశారు.

కాగా, మను బాకర్ ఈ రేర్ రికార్డు సొంతం చేసుకోవడం పట్ల క్రీడాభిమానులు, భారత ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తండ్రి రామకృష్ణ బాకర్ కుమార్తె విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. “నేను కూడా మీ లాగే ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇది భారతీయులకు ఓ శుభవార్త. నా కుమార్తెపై మీరు చూపించిన ప్రేమాభిమానులకు నేును ఎంతో కృతజ్ఞుడను” అంటూ రామకృష్ణ బాకర్ పేర్కొన్నారు.

మరోవైపు సరబ్‌జోత్ సింగ్ కుటుంబం కూడా విజయానందంతో సంబరాలు చేసుకుంటోంది. సరబ్‌జోత్ తండ్రి జితేందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. “మను బాకర్‌తో పాటు నా కుమారుడు కాంస్య పతక గెలుచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనుతో పాటు ఆమె కుటుంబానికి నా శుభాకాంక్షలు. నేను గురుద్వారాకు వెళ్లి దేవుడికి ప్రార్థించుకుని వస్తాను. మా ఊర్లో ఇక సంబరాలు జరుగుతాయి.” అంటూ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు.