
ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వాహా చేశారని విపక్ష నేత ఆర్ అశోక ఆరోపించారు. ముడా స్కామ్, వాల్మీకి స్కామ్‌లన్నింటిలో సిద్ధరామయ్య హస్తం ఉందని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య అవినీతికి వ్యతిరేకంగా తాము పాదయాత్ర చేపడతామని బిజెపి నేత వెల్లడించారు.
పేదలకు ఉద్దేశించిన సొమ్మును కర్నాటక కాంగ్రెస్ సర్కార్ లూటీ చేస్తోందని ఆయన మండిపడ్డారు. కర్నాటకలో భారీ కుంభకోణాలు వెలుగుచూశాయని, ఈ స్కామ్‌లన్నింటిలో సిద్ధరామయ్య చేతివాటం చూపారని ఆరోపించారు. తాము చేపట్టే పాదయాత్రలో బీజేపీ జాతీయ నాయకులు, జేడీఎస్ నేతలు పాల్గొంటారని ఆయన వివరించారు.
కాగా, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అంతకుముందు ఆరోపించారు. ముడా స్కామ్‌లో స్వయంగా కర్నాటక సీఎం లబ్ధిదారుడని, వాల్మీకి స్కామ్‌లోనూ అవినీతి చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఈ అంశాలను లేవనెత్తారని, కాంగ్రెస్ సభ్యులు అవినీతి కర్నాటక సర్కార్ కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
ఈ స్కామ్‌ల్లో కాంగ్రెస్ హైకమాండ్‌కు వాటాలు అందుతున్నాయని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో ఈ స్కామ్‌లపై బీజేపీ ఎంపీలను మాట్లాడనీయకుండా కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐ విచారణకు తాము డిమాండ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాగా, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం అవినీతి రాజ్యమేలుతోందని, రాష్ట్రం కుంభకోణాల మయమైందని బీజేపీ ఎంపీ సుదాన్షు త్రివేది ఆరోపించారు.
More Stories
క్రమేపీ తగ్గిపోతున్న నోటా ఓట్ల శాతం
ట్రంప్‌తో భేటీలో ప్రధాని హుందాగా నడుచుకున్నారు
మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణ