పదేళ్లలో అభివృద్ధిలో అగ్రగామిగా ఆంధ్ర ప్రదేశ్

పదేళ్లలో అభివృద్ధిలో అగ్రగామిగా ఆంధ్ర ప్రదేశ్

రానున్న పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో అగ్రగామిగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. జల వనరులు, ఖనిజ వనరులు, సువిశాలమైన కోస్తా తీరం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సారవంతమైన భూమి వంటి అభివృద్ధికి అవసరమైన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. 

శనివారం ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అందరికంటే ముందు చంద్రబాబు మాట్లాడారు. దాదాపు ఏడు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో గత కొంతకాలంగా తాను చేస్తున్న వినూత్న ప్రతిపాదన పీ-4 గురించి చంద్రబాబు ప్రస్తావించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కోరినప్పుడు సమావేశంలో సానుకూల ప్రతిస్పందన లభించింది. 

ఇప్పటి వరకూ అమలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) వల్ల వచ్చే లాభాలేమిటో దేశానికి తెలుసని, కానీ ఇందులో ప్రజల భాగస్వామ్యం ఉండేలా నాలుగో ‘పీ’ కూడా చేరితేనే పేదరిక నిర్మూలన సాధ్యమని వివరించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన సున్నా పేదరికం లక్ష్యాన్ని సాధించాలంటే పీ-4 అమలు చేయాలని తెలిపారు. 

సాంకేతికతను పేదల అభ్యున్నతికి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పారు. నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గతంలో స్వర్ణ చతుర్భుజి ద్వారా రహదారుల అనుసంధానం చేసి ఫలితాలు సాధించామని, ఇప్పుడు నదుల అనుసంధానం దేశానికి చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. 

నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో రోడ్‌మ్యా్‌పను రూపొందించాలని సూచించారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం ఫలితాలను ఏపీ అనుభవిస్తోందని చంద్రబాబు వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా వైద్య సదుపాయాలు అందించాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. 

అధిక జనాభా దేశ బలహీనత కాదని, బలమని తెలిపారు. యువత మన దేశానికున్న అతిపెద్ద వనరుగా అభివర్ణించారు. యువతను సరిగ్గా వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చని చెప్పారు. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ సాధించడం ఏమంత కష్టం కాదని, మన దేశ సంపదను సక్రమంగా వినియోగించుకుంటే 50 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీని సాధించడం ఆసాధ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

నీతిఆయోగ్‌ సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సమావేశంలో దాదాపు పది అంశాలు ప్రస్తావించానని, ఏపీలో ఉన్న అవకాశాలను వివరించానని చెప్పారు. పోలవరం, అమరావతికి తోడ్పాటు అందిస్తునందుకు, విభజన హమీలను త్వరితగతిన పరిష్కరిస్తున్నందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.