ఏపీలో హత్యకు గురైన వారి పేర్లు చెప్పమని చంద్రబాబు సవాల్!

ఏపీలో హత్యకు గురైన వారి పేర్లు చెప్పమని చంద్రబాబు సవాల్!

ఏపీలో ఎన్నికల అనంతరం 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆరోపిస్తున్నారే తప్ప, ఆ చనిపోయిన వాళ్ల పేర్లు ఎందుకు వెల్లడించలేకపోతున్నారని చెబుతూ  జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘దమ్ముంటే అసెంబ్లీకి రా.. ప్రతి విషయంపై అసెంబ్లీలో చర్చ పెడదాం’ అని సవాల్ విసిరారు.

రాజకీయ కక్షసాధింపు తనకు ఇష్టం ఉండదని అయితే హత్యలు చేసి తప్పించుకుంటామంటే ఊరుకోమని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు. 2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని సభ ముందు ఉంచిన సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం  ఇస్తూ ఈ వాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం పెరగలేదు కానీ వైసీపీ నేతల ఆదాయం వందల వేల లక్షల రెట్లు పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే.. పాలన మారితే మళ్లీ పీకపై కత్తిపెడతానని పారిశ్రామిక వేత్తలను మాజీ సీఎం జగన్ బయపెడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 

“రషీద్ అనే వ్యక్తి చనిపోతే అతడి ఇంటికి వెళ్లాం అని చెప్పుకుంటున్నారు. ఎవరీ రషీద్? చంపినవాడెవడు? చచ్చినవాడెవడు? వాళ్లు ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నా. మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారా, లేదా? సరే అది అయిపోయింది.  36 మంది చనిపోయారని గవర్నర్ వద్దకు వెళ్లావు. ఆ 36 మంది పేర్లు ఇవ్వండి” అంటూ నిలదీశారు.

“రషీద్ అనే వ్యక్తిని చంపినవాళ్లను అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, నీకు సిగ్గుంటే, నీజాయతీ ఉంటే ఆ పేర్లు ఇవ్వు.  గతంలో నువ్వు చంపిన వాళ్ల పేర్లు నేనిచ్చాను. ఇప్పుడు వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటా. మళ్లీ ఆ కేసులన్నీ ఓపెన్ చేస్తాం. ఇవాళ నువ్వు చెబుతున్న వాటిపై కూడా నేను చర్యలు తీసుకుంటా.  సిద్ధమా? అని సవాల్ విసురుతున్నా” అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. 

మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో 22 ఏ ఫైళ్లు తగలబెడితే అది అగ్ని ప్రమాదం అంటారా? దాన్ని విచారణ చేయిస్తే తప్పా. మాజీ మంత్రి వివేకాది గుండెపోటు అంటే నమ్మాలా? చివరకు మీరే చంపారు అంటే ఒప్పుకోవాలా? అంటూ ప్రశ్నించారు. తర్వాత ఆదినారాయణ రెడ్డి చంపేశారు అన్నారని పేర్కొంటూ ముచ్చుమర్రిలో తప్పుచేసిన వారిని వదిలి పెట్టమని చూపించామని చంద్రబాబు గుర్తు చేశారు.