
పోలవరం నిర్మాణం జాప్యానికి గత ప్రభుత్వమే కారణమని లోక్ సభలో కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర వైఖరితోనే పనుల్లో జాప్యం జరిగిందని చెబుతూ వస్తున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రివర్స్ గేర్ లో కేంద్రం షాక్ ఇస్తూ కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ లోక్‌సభలో గురువారం స్పష్టం చేశారు.
పోలవరం గురించి పూర్తి వివరాలు పార్లమెంట్‌లో వెల్లడిస్తూ కాంట్రాక్టర్లను మార్చడం వల్లనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి పోలవరం తొలి దశ (41.5 మీటర్ల ఎత్తు) పనులు పూర్తి అవుతాయని తెలిపారు.
లోక్‌సభలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయులు, జిఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు పనుల పరిశీలన, ఆలస్యానికి కారణలు తెలుసుకోవడానికి 2021 ఆగస్టులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఐఐటి హైదరాబాద్ నుంచి సహకారం తీసుకున్నామని తెలిపారు. 2021 నవంబర్‌లో ఐఐటీ హైదరాబాద్ రిపోర్టు సమర్పించిందని తెలిపారు.
ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యానికి ప్రధాన కారణాలుగా కాంట్రాక్టర్ల మార్పు, భూసేకరణ, పునరావాసం, పరిహారం ఆలస్యం కావడం, కోవిడ్ 19 మహమ్మారి, దాని సంబంధిత పరిస్థితులు గుర్తించామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈఎల్ 41.15 మీటర్ల ఎత్తుతో మొదటి దశ పోలవరం ప్రాజెక్టు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు (పీఐపీ) జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినట్లు గుర్తు చేశారు. 2014 ఏప్రిల్ 1 నుంచి ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ కింద వంద శాతం కేంద్రమే భరించేందుకు 2016లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపిందని వివరించారు.
గత మూడేళ్ళలో రూ. 8,044.31 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చినట్లు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. మూడేళ్ల పనుల పురోగతి వివరాలను కూడా సమాధానంలో పొందుపరిచారు. 2021-22 నుంచి మూడేళ్ళలో ప్రాజెక్టు ప్రధాన పనుల్లో 21 శాతం మట్టి పనులు, కాంక్రీటు పనులు కేవలం 5.3 శాతం జరిగాయని స్పష్టం చేశారు.
కుడి కాలువకు లైనింగ్ పనులు 1.72 శాతం, స్ట్రక్చర్స్ 0.39 శాతం జరిగాయన్నారు. ఎడమ కాలువకు మట్టి పనులు 0.30 శాతం, లైనింగ్ 1.18 శాతం, స్ట్రక్చర్స్ 3.33 శాతం జరిగాయన్నారు. భూసేకరణ 0.22 శాతం, సహాయ పునరావాస కార్యక్రమం కేవలం 8 శాతం జరిగిందని వివరాలను కేంద్ర మంత్రి వెల్లడించారు.
More Stories
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ
షర్మిల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా?