వైసిపి ఆర్ధిక దోపిడీతో ఏపీకి రూ. 76,795 కోట్ల నష్టం

వైసిపి ఆర్ధిక దోపిడీతో ఏపీకి రూ. 76,795 కోట్ల నష్టం
గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడంతో పెట్టుబడులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం గత ప్రభుత్వ ఆర్థిక అవకతవలకపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం మళ్లించారని దుయ్యబట్టారు.

“ప్రజలపై రకరకాల పన్నులు వేసి, ఆ మొత్తం జేబులో వేసుకుని, మళ్ళీ అప్పులు చేశారు. ఆర్ధిక విధ్వంసం చేసారు. ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆర్ధిక విధ్వంసానికి ఒక ఉదాహరణ: 33 సంస్థల నుంచి వాళ్ళు దాచుకున్న డబ్బులు, రూపాయి లేకుండా మొత్తం లాగేసారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో రూ.1.35 లక్షల కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మొత్తం బాకీలు పెట్,  దోచుకుని, జగన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఈ భారం మొత్తం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై పడింది” అని చంద్రబాబు సభలో వివరించారు.

పోలవరం పూర్తయి ఉంటే ఏపీకి రూ. 45 వేల కోట్ల ఆదాయం వచ్చేదని తెలిపారు. ఇసుక అక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ. 7 వేల కోట్లు , గనుల దోపిడీ ద్వారా రాష్ట్రానికి రూ.9,750 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. రాజధాని అమరావతిని కొనసాగించి ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి చెందేదని, రూ. 3లక్షల కోట్ల ఆస్తి , 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని బాబు చెప్పారు. ఏపీకి ఆదాయ వనరులు భారీగా తగ్గాయని, వృద్ధిరేటు 13.5 నుంచి 9. 5 శాతానికి పడిపోయిందని వెల్లడించారు.

“జగన్ రెడ్డి పాలన ఎంత అధ్వానం అంటే భవిష్యత్తులో 15 ఏళ్ళ పాటు వచ్చే మద్యం ఆదాయం చూపించారు.వాటిపై అప్పులు తెచ్చుకున్నాడు. విభజన వల్ల జరిగిన నష్టం కన్నా జగన్ వల్ల జరిగిన నష్టమే రాష్ట్రానికి ఎక్కువ. జూన్, 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు (దాదాపు పది లక్షల కోట్లు). వీటిలో ఇంకా కార్పోరేషన్ రుణాలు, ఇతర శాఖల నుంచి రావలిసిన సమాచారం ఇంకా ఉంది” అని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

 
పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయంలో పట్టిసీమ పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లు కూడా టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేవని వ్యాఖ్యానించారు. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఏపీని మార్చామని, కానీ వైసీపీ పాలనలో ఎలాంటి పెట్టుబడులు లేకుండా పోయాయని దుయ్యబట్టారు.