తెలంగాణ బడ్జెట్‌లో మహిళా సాధికారికతకు ప్రాధాన్యత

తెలంగాణ బడ్జెట్‌లో మహిళా సాధికారికతకు ప్రాధాన్యత
తెలంగాణ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్‌లో మహిళా సాధికారికతకు ప్రాధాన్యత ఇచ్చింది. వారికోసం బడ్జెట్‌లో వినూత్న పథకాలను ప్రతిపాదించింది. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా 63 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరాలనేది ప్రభుత్వం లక్ష్యం. 
 
స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌‌లలో మెలకువలు నేర్పించేందుకు సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది.  మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్‌ కేంద్రాలతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్టి చేకూరే విధంగా కార్యాచరణ చేపడుతుంది. వచ్చే ఐదేళ్లలో 25,000 సంస్థలకు విస్తరింపచేయడానికి కృషి చేయనున్నారు. దీంతో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద సభ్యురాలు మరణించినపుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 50.41 కోట్ల కేటాయించారు. ఈ పధకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తారు. 
 
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ. 10 లక్షల జీవిత బీమా వర్తింపజేస్తారు స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్‌ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌కు) కు 3.20 ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
 
అలాగే, మహిళా స్వయం సహాయక సంఘాల ఏటా కనీసం రూ. 20 వేల కోట్లకు తగ్గకుండా వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల వడ్డి లేని రుణాలు అందించాలని నిర్ణయించింది. మైక్రో, స్మాల్‌ ఇండిస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాకారం అందించనుంది.  రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్​ను శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రకటించారు.
కీలక రంగాలైన వ్యవసాయానికి రూ.72,659 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.29,816 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లు కేటాయించారు. రాష్ట్ర  ఆవిర్భావ సమయానికి రూ.75,577 కోట్ల అప్పు 2023 డిసెంబరు నాటికి రూ.6,71,757 కోట్లుకు చేరిందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు పది రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత రూ.35,118 కోట్ల రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు, వడ్డీలతో కలిపి రూ.42,892 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ప్రకటించారు.  ఇప్పటివరకు రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశామని. ఈ పథకాల్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా, బియ్యంపై సబ్సిడీ, ఉన్నాయని డిప్యూటీ సీఎం సభకు వివరించారు.
ఈ ఏడాదిలోనే రైతు కూలీలకు రూ.12 వేలు అందించే బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది నుంచే పీఎం ఫసల్​ బీమా ప్రీమియం యోజనలో చేరాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కల్పిస్తామని, వరి రైతులకు క్వింటాకు రూ.500 బోనస్​ ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు.