
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని భావిస్తున్నారు. . ఎన్డీయే కూటమి పార్టీల పాలిత రాష్ట్రాలకు మాత్రం ఈ బడ్జెట్లో మోదీ సర్కార్ వరాలు జల్లు కురిపించింది.
ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ఈ బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వ వైఖరిపై మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కాగా, ఒకరు తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు నీతి ఆయోగ్ మీటింగ్కు హాజరు కావడం లేదు.
బడ్జెట్లో ప్రతిపక్ష రాష్ర్టాలపై మోదీ సర్కార్ వివక్ష చూపారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా తమ పార్టీ ముఖ్యమంత్రులు ముగ్గురు ఈ సమావేశానికి హాజరుకారని స్పష్టం చేశారు. ఇక నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు.
బడ్జెట్లో కేంద్రం చూపిన వైఖరిపై బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ వారు నీతి ఆయోగ్ సమావేశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ సమావేశానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆయన తొలిసారిగా ఈ సమావేశంలో పాల్గొననున్నారు..
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’