కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక కేంద్రంపై విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక కేంద్రంపై విమర్శలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక కేంద్రంపై విమర్శలు చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో తమ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం  కేంద్రం మీద గతంలో బిఆర్‌ఎస్ బురదజల్లిందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. 

కేసీఆర్ ఎలాగైతే వ్యవహరించారో అదే తరహాలో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని చెబుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తుండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని తెలిపారు.  రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించే నీతి ఆయోగ్ ను బహిష్కరిస్తామని చెప్పడం తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ ఉద్దేశపూర్వకంగా విస్మరించడమే అని స్పష్టం చేశారు.

బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పడానికి రేవంత్‌కు నోరు ఎలా వచ్చిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఢిల్లీకి రాగానే చెక్కులు రాసిస్తారా? అని ఎద్దేవా చేశారు. దీక్ష చేసినంత మాత్రాన తెలంగాణకు ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.

కొత్త రేషన్ కార్డులు, కొత్త పించన్లు లేవు సరికదా పాత పింఛన్లు కూడా ఇవ్వడం లేదని అంటూ ఎన్ని హామీలిచ్చారు..? ఏం చేశారో చెప్పమంటే చేతకాదు కానీ బడ్జెట్ పేరు చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడతారా? అని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  సైనిక్ స్కూలు తెలంగాణలో రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు. 

బయ్యారం విషయంలో అక్కడ లభించే ఐరన్ ఓర్ నాణ్యత అంత బాగాలేదని నిపుణులు అభిప్రాయాన్ని చెప్పారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రం ఇప్పటిదాకా పదేళ్లలో రూ.10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలను పొందుపర్చారని స్పష్టం చేశారు. 

కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం అంటే బ్లాక్ మెయిల్ చేయడమేనని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు  మోదీ సర్కారు ద్వారా పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అందుకే 35 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. కనీస అవగాహన లేకుండా బడ్జెట్‌లో తెలంగాణకు ఏమి లేదంటే కేంద్రప్రభుత్వాన్ని తిట్టడం సరికాదని హితవు చెప్పారు. కేంద్రాన్ని తిట్టడానికి అసెంబ్లీని కేంద్రంగా చేసుకున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా రూపంలో 2 లక్షల కోట్లు తెలంగాణకు బదిలీ చేసిందని, కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన విషయం వాస్తవం కాదా? అని కిషన్ రెడ్డి నిలదీశారు.