ఖలిస్తానీ తీవ్రవాదులతో కలుషితమవుతున్న కెనడా

ఖలిస్తానీ తీవ్రవాదులతో కలుషితమవుతున్న కెనడా

ఖలిస్తానీ తీవ్రవాదుల కారణంగా కెనడా కలుషితమవుతోందని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక చట్టాలు అందించిన స్వేచ్ఛను వారంతా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. 

ఇటీవల వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోలో తనతో పాటు సన్నిహితులను భారత్‌కు వెళ్లిపోవాలంటూ హెచ్చరించడంపై చంద్ర ఆర్య స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ ఖలిస్తానీ వేర్పాటువాదుల చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘హిందువులమైన మేము ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి కెనడాకు వచ్చి స్థిరపడ్డాం. దక్షిణాసియాలోని ప్రతి దేశం, ఆఫ్రికా, కరేబియన్‌లోని అనేక దేశాల నుంచి, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చాం. కెనడా మా స్వస్థలం’ అని స్పష్టం చేశారు. 

“కెనడా సామాజిక – ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించాం. ఇక్కడ మా సేవలు కొనసాగుతూనే ఉంటాయి. చరిత్ర కలిగిన భారత సంస్కృతి, వారసత్వం ద్వారా కెనడా బహుళ సాంస్కృతిక సంప్రదాయాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాం. ఈ క్రమంలో కెనడా ఇచ్చిన హక్కులను ఖలిస్తానీ మద్దతుదారులు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారి కారణంగానే కెనడా కలుషితమవుతోంది” అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కాగా, ఎడ్మాంటన్‌లోని ‘బీఏపీఎస్‌’ స్వామి నారాయణ్‌ మందిరంలో కొంతమంది దుండగులు మళ్లీ విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. దేవాలయం గోడలపై రంగులు జల్లారు. విద్వేషపూరిత వ్యాఖ్యల్ని రాశారు. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనపై కూడా చంద్ర ఆర్య తీవ్రంగా తీవ్రంగా ఖండించారు. దేవాలయాలపై దాడులు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.