
ప్రస్తుత బడ్జెట్‌ను అమృత్ కాలానికి చెందిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2047 నాటికి వికసిత్ భారత్ పూర్తి చేసే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చేశారని, వచ్చే ఐదేళ్ల పాటు దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈసారి ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ రాబోయే ఐదేళ్లు తమకు కార్యనిర్దేశం చేసేదిగా ఉంటుందని పేర్కొన్నారు.
2047లో వికసిత్ భారత్ కలను నెరవేర్చడానికి పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. త్వరలో సమర్పించనున్న బడ్జెట్ అత్యంత కీలకమైందని ప్రధాని మోదీ అభివర్ణించారు. లోక్‌సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.
“ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ బడ్జెట్ అమృత్ కాల్ సమయంలో ప్రవేశపెట్టే బడ్జెట్. దేశ ప్రజాస్వామ్యం గర్వించదగ్గ ప్రయాణంలో బడ్జెట్ సెషన్ ఒక ముఖ్యమైన గమ్యస్థానం” అని ప్రధాని తెలిపారు.
గత పార్లమెంట్ సెషన్లో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ వాణిని వినిపించలేకపోయారని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యూహాలకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ స్థానం లేదని స్పష్టం చేశారు. ఆ రాజకీయాల నుంచి పార్టీలు అన్నీ బయటకు వచ్చి దేశం కోసం పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని చెబుతూ తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని ప్రధాని చెప్పారు. ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని కూటమి నేతలకు ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. అదేవిధంగా గత చేతు అనుభవాలను పక్కనపెట్టి దేశాభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలను మోదీ కోరారు.
“పార్టీలకతీతంగా సభ్యులు వ్యవహరించాలి. దేశానికి తమను తాము అంకితం చేసుకోవాలి. గౌరవప్రదమైన ఈ పార్లమెంట్ వేదికను ఎంపీలంతా ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారం చేపట్టింది. 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాది. దేశానికి దిశానిర్దేశం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంటుంది” అని ప్రధాని చెప్పారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’
గగన్‌యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో