సముద్ర, మంచినీటి వనరుల్లో తగ్గిపోతున్న ఆక్సిజన్‌

సముద్ర, మంచినీటి వనరుల్లో తగ్గిపోతున్న ఆక్సిజన్‌

భూమిపై సముద్ర, మంచినీటి వనరుల్లో ఆక్సిజన్‌ తగ్గిపోతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇది భూమిపై ఉన్న ప్రాణులకు భారీ ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటివనరుల్లో ఆక్సిజన్‌ స్థాయిలపై న్యూయార్క్‌లోని రెన్సెలియల్‌ పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ కెవిన్‌ సీ రోస్‌ నేతృత్వంలో ఒక అధ్యయనం జరిగింది. 

ఈ వివరాలు ‘నేచర్‌ ఎకాలజీ, ఎవల్యూషన్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం.. భూమిపై జీవించే ప్రాణులకు గాలిలోని ఆక్సిజన్‌ ఎంత ముఖ్యమో, సముద్రంలో, మంచినీటి వనరుల్లో జీవించే జలచరాలకు సైతం నీటిలోని ఆక్సిజన్‌ అంతే అవసరం.

పెరుగుతున్న గ్రీన్‌హౌజ్‌ వాయువు ఉద్గారాల కారణంగా నీటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, వేడి నీరు ఎక్కువగా ఆక్సిజన్‌ను సరిగ్గా ఒడిసిపట్టలేదని పరిశోధకులు తెలిపారు. నీటిలో మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం, వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం కూడా ఈ పరిస్థితికి కారణమవుతున్నట్టు చెప్పారు. 

కోట్లాది మంది ప్రజలు తమ ఆహారం, ఆదాయం కోసం జలచరాలపై ఆధారపడుతున్నారని, నీటిలో ఆక్సిజన్‌ తగ్గిపోవడం వల్ల మొత్తం వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిలో ఆక్సిజన్‌ తగ్గిపోవడంపై కూడా ఒక పరిమితి విధించాలని ప్రతిపాదించారు. 

ఇప్పటివరకు వాతావరణ మార్పు, ఓజోన్‌ క్షీణత, ప్రపంచ మంచినీటి వినియోగం, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టం వంటి తొమ్మిది అంశాలపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కొన్ని పరిమితులు ప్రతిపాదించారు. వీటినే ‘ప్లానెటరీ బౌండరీస్‌’ అంటారు. ఈ ప్లానిటరీ బౌండరీస్‌లో ఉన్న పరిమితులు మీరకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నీటిలో ఆక్సిజన్‌ తగ్గిపోవడాన్ని కూడా ‘ప్లానెటరీ బౌండరీస్‌’లో పదో పరిమితిగా చేర్చాలని పరిశోధకులు సూచించారు.