రిజర్వేషన్ల కోటా తగ్గించాలన్న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు

రిజర్వేషన్ల కోటా తగ్గించాలన్న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు
బంగ్లాదేశ్‌లో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో గత కొన్ని రోజులుగా రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఉపశమనం లభించింది.  కోటాను సవాలు చేస్తూ విద్యార్థుల తరపు న్యాయవాది షా మొంజూరుల్ హోక్ వాదనలు వినిపించారు. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టాలని కోర్టు కోరింది.
 
రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా గత వారం రోజులుగా జరుగుతున్న నిరసనలు చివరికి హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనలో 150 మందికి పైగా మరణాలు, 2,500 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ విషయంపై విచారణ చేసిన సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.
 
నిరసనల దృష్ట్యా.. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ, మొబైల్ డేటా, ఏటీఎం సేవలను నిలిపివేసింది. ఇంటర్నెట్ షట్‌డౌన్‌తో సహా కఠినమైన చర్యలను విధించింది. గుమిగూడకుండా ఉండేందుకు అధికారులు ప్రభుత్వ సెలవులు కూడా ప్రకటించారు. రాజధాని ఢాకా సైనిక నిఘాలో ఉంది. అల్లర్లను నియంత్రించడానికి ప్రభుత్వం `కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరిస్థితి మరింత కఠినంగా మారింది.

1971లో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి కుటుంబాల కోసం బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్‌ విధానాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం కోటా కల్పిస్తూ బంగ్లా ప్రభుత్వం ఇటీవల రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. ఆ రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా అధికారులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాస్తవానికి 2018లోనే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యార్థులు నిరసనకు దిగడంతో వెనక్కి తగ్గింది.

ఈ ఏడాది జూన్‌లో ఢాకా హైకోర్టులో కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడటంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌లపై ఇవాళ అత్యవసరంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. స్వాతంత్ర్య సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించింది. 93 శాతం నియామకాలు ప్రతిభ ఆధారంగానే చేపట్టాలని స్పష్టం చేసింది. మిగిలిన రెండు శాతం మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని సూచించింది.

కాగా రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. యూనివర్సిటీలు మూతపడ్డాయి. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌, రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించడంతో అల్లర్లు మరింత తీవ్రమయ్యాయి.

దాంతో సైన్యం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఆఖరికి కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, ఈ హింసాత్మక ఘటనల్లో జరిగిన మరణాలపై ప్రభుత్వం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఇంత ఆందోళనలు జరిగినా ప్రధాని హసీనా మాత్రం నూతన రిజర్వేషన్‌ వ్యవస్థను సమర్థించారు. దేశం కోసం పోరాడిన వారికి గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆందోళనల కారణంగా బంగ్లాదేశ్‌లో చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగొచ్చారు.