ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయం

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయం
 
* విమానం, బ్యాంకింగ్, మీడియా సేవలకు విఘాతం
 
మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్‌, మీడియా వంటి పలు రంగాలపై ప్రభావం చూపింది. అమెరికాలోని సెంట్రల్ క్లౌడ్ సేవలకు సంబంధించి సమస్యలు తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.  అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లో కాన్ఫిగరేషన్ మార్పు వల్ల మైక్రోసాఫ్ట్ 365 సేవలకు విస్తృతంగా అంతరాయం కలిగినట్లు పేర్కొంది. 
 
దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.  వివిధ దేశాల్లో మైక్రోసాఫ్ట్ 365ను ఉపయోగిస్తున్న అనేక సంస్థలకు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. ఫలితంగా శుక్రవారం కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 
 
అమెరికన్ ఎయిర్​లైన్స్, డెల్టా వంటి విమానయాన సంస్థలతోపాటు వీసా, ఏడీటీ సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్​ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందిపడ్డాయి. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, స్కై న్యూస్​ టీవీ, రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ఎయిర్​పోర్టుల్లో ప్రయాణికులకు బోర్డింగ్ పాస్​లు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది.
ఫలితంగా మాన్యువల్​గా బోర్డింగ్ పాస్​లు జారీ చేయాల్సి రాగా, ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. అలాగే అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు అందించే 911పై ప్రభావం పడింది.  భారత్​లోని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు స్పైస్​జెట్, ఇండిగో సహా దేశంలోని అన్ని విమానయాన సంస్థలూ ప్రకటించాయి. బోర్డింగ్ పాస్​ల జారీ సహా ఇతర పనుల కోసం ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపాయి. 
 
అయితే, ఈ పరిస్థితి కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోర్డింగ్ పాస్​ కోసం చాలాసేపు క్యూలో నిలబడాల్సి వచ్చిందని, సిబ్బంది తమ పేర్లను తప్పుగా రాసి ఇచ్చారని వాపోయారు.  ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలలో కొన్ని ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేనట్లు అకాసా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. 

న్యూజిలాండ్‌లోని కొన్ని బ్యాంకుల ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయినట్లు వెల్లడించాయి. అలాగే పలు దేశాల్లో హాస్పిటల్‌ సేవలతోపాటు స్టాక్‌ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది. వార్తా ప్రసారాలు జరుగుతుండగా మధ్యలో స్కై న్యూస్ నిలిచిపోయింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 

సాంకేతిక సమస్య తలెత్తడానికి కారణాలను మైక్రోసాఫ్ట్​ వెల్లడించలేదు. అయితే, పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితిపై మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతుంది. ఇక ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌తోపాటు ఆన్‌లైన్ సేవలపై దాని ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో సాంకేతిక సమస్య కారణంగా, ప్రపచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ దర్శనమిస్తోంది. ల్యాప్‌ట్యాప్‌/ పీసీ స్క్రీన్‌లపై ఈ ఎర్రర్‌ కనిపించి, వెంటనే సిస్టమ్‌ షట్‌డౌన్‌ గానీ, రీస్టార్ట్ అవుతోంది. దీంతో యూజర్లు ఎక్స్‌ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్‌ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.