యుపిలో ఎదురుదెబ్బకు ఆరు కారణాలు గుర్తించిన బిజెపి

యుపిలో ఎదురుదెబ్బకు ఆరు కారణాలు గుర్తించిన బిజెపి
* 10 అసెంబ్లీ ఉపఎన్నికలపై బిజెపి దృష్టి
 
ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల లోక్ సభ ఎన్నికలలో ఎదురుదెబ్బకు గల కారణాలను వివరిస్తూ రాష్ట్ర బీజేపీ విభాగం పార్టీ కేంద్ర నాయకత్వంకు విస్తృతమైన నివేదికను సమర్పించింది.  పేపర్ లీకేజీలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాంట్రాక్టు కార్మికుల నియామకం, రాష్ట్ర పరిపాలనలో అధికారుల ఆధిపత్యంతో పార్టీ కార్యకర్తల్లో అ అసంతృప్తికి కారణమైనట్లు నివేదిక వివరించినట్లు తెలుస్తున్నది. 
 
సమాజ్‌వాదీ పార్టీ- కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికలలో రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాల్లో 43 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్డీయే 36 సీట్లకు పరిమితమైనది. 2019 ఎన్నికలలో ఎన్డీయే 64 సీట్లను గెలుచుకుంది.  ఎన్నికల ప్రచార లోపాలను సహితం ప్రస్తావిస్తూ రాష్ట్ర బిజెపి రూపొందించిన సమగ్ర 15 పేజీల విశ్లేషణను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి గత బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు సమర్పించారు.
 
అయోధ్య, అమేథీ వంటి కీలక నియోజకవర్గాలపై నిర్దిష్ట పరిశీలనతో పార్టీ పనితీరును అంచనా వేయడానికి దాదాపు 40,000 మంది నుండి అభిప్రాయాన్ని సేకరించినట్లు బిజెపి వర్గాలు సూచిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలలో బీజేపీ ఓట్ల శాతంలో 8 శాతం గణనీయమైన తగ్గుదలని నివేదిక ప్రస్తావించింది.
 
యుపి బిజెపి అధ్యక్షుడి నివేదిక పార్టీ కార్యకర్తలు, పరిపాలనలో ఉన్న అసంతృప్తిని పేలవమైన పనితీరుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఓటరు జాబితా నుంచి బీజేపీ ఓటర్ల పేర్లను తొలగించడం మరో అంశం. పరిపాలనా వైఖరి వల్ల ఉద్యోగులలో ఏర్పడిన అసంతృప్తి ఎన్నికల సమయంలో నిష్క్రియాత్మకతకు దారితీసిందని నివేదిక పేర్కొంది.
 
అదనంగా, కొందరు అధికారులు ప్రతిపక్ష అభ్యర్థులకు సహాయం చేసిన సందర్భాలను కూడా నివేదికలో ప్రస్తావించారు. అంతేకాకుండా, గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు లేకపోవడం కూడా పార్టీ నష్టానికి కారణమైందని ప్రధాని మోదీకి సమర్పించిన నివేదిక సూచించింది. ఇది వివిధ నియోజకవర్గాల్లో నిర్దిష్ట పోకడలతో పాటు విచిత్రమైన కుల సమీకరణలను మరింత ప్రస్తావించింది.
 
అనేక నియోజకవర్గాలలో, సాంప్రదాయకంగా బిజెపికి మద్దతు ఇచ్చే కులాలు కూడా పార్టీ అభ్యర్థులకు ఓటు వేయలేదు.  భవిష్యత్తులో ఎన్నికలు లాభపడిన, వెనుకబడిన వర్గాల మధ్య పోటీగా మారకుండా నిరోధించడానికి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని కేంద్ర నాయకత్వాన్ని కోరింది.  ఈ నివేదికలో బిజెపికి కలిగిన ఎదురుదెబ్బకు ముఖ్యంగా ఆరు ప్రాథమిక కారణాలను గుర్తించింది.  వీటిలో గ్రహించిన పరిపాలనాపరమైన అత్యుత్సాహం, పార్టీ కార్యకర్తలలో అసంతృప్తి, తరచుగా పేపర్ లీక్‌లు, ప్రభుత్వ పదవులలో కాంట్రాక్టు కార్మికుల ఉపాధి వంటివి ఉన్నాయి.
 
“మా ఎమ్మెల్యేలకు అధికారం లేదు. జిల్లా మేజిస్ట్రేట్‌, అధికారులు (అధికారులు) పాలన సాగిస్తున్నారు. ఇది మా కార్యకర్తలను అవమానానికి గురి చేస్తోంది. ఏళ్ల తరబడి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కలిసి పనిచేశాయి.  సమాజంలో బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నాయి. పార్టీ కార్యకర్తలను అధికారులు భర్తీ చేయలేరు” అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.
 
రాష్ట్రంలో గత మూడేళ్లలో కనీసం 15 పేపర్ లీక్‌లు కావడంతో పాటు బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దుచేస్తారనే ప్రతిపక్షాల ప్రచారం కూడా ప్రతికూలతకు దారితీసిన్నట్లు భావిస్తున్నారు.   బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా లక్నోలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన తర్వాత, ఈ సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఇతర ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపారు.
 
కూర్మి, మౌర్య వర్గాల నుండి మద్దతు తగ్గిందని, దళితుల ఓట్లు తగ్గాయని పేర్కొంటూ  ఈ నివేదిక పలు సూచనలు కూడా చేసింది. మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఓట్ల శాతం తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు అదనపు కారకాలుగా వివరించింది.
 
ఇలా ఉండగా, 10 అసెంబ్లీ స్థానాలకు మరో రెండు నెలల్లో జరుగబోయే ఉపఎన్నికలపై బిజెపి ద్రుష్టి సారించింది. ఎంపీలుగా ఎన్నికైన ఎమ్యెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నికలు జరుగనున్నాయి. వీటిల్లో ఐదు ఉపఎన్నికలు ఎస్పీ అభ్యర్థుల రాజీనామా కారణంగా ఏర్పడనున్నవి కావడం గమనార్హం.
 
ఉపఎన్నికలు ప్రతిష్టాకరంగా తీసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 30 మంది మంత్రులకు స్పష్టమైన బాధ్యతలు అప్పచెప్పారు. ప్రతి మంత్రి తమకు కేటాయించిన ప్రాంతంలో వారంలో రెండు రాత్రులు అక్కడే గడపాలని చెప్పారు.