ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 10 శాతం రిజర్వేషన్‌

ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 10 శాతం రిజర్వేషన్‌
అగ్నివీర్‌లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వయో సడలింపుతోపాటు ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పింది. సాయుధ దళాలలో నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ గడువు ముగిసి బయటకు వచ్చే అగ్నివీర్‌లను ఆదుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తెలిపారు.
 
 ఇతర ప్రయోజనాలతోపాటు రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్‌లో పది శాతం కోటా కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌లో వయో సడలింపు, సమాంతర రిజర్వేషన్ ఇస్తామని వెల్లడించారు.  కాగా, గ్రూప్ బీ, సీ ప్రభుత్వ పోస్టులకు నిర్దేశించిన గరిష్ట వయస్సులో అగ్నివీర్‌లకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు సీఎం నయాబ్ సింగ్ సైనీ తెలిపారు. 
 
2027లో సర్వీస్ ముగిసే అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్‌కు వయస్సు సడలింపు ఐదు సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. ‘గ్రూప్ సీలోని సివిల్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్‌లకు ఐదు శాతం, గ్రూప్ బీలో ఒక శాతం సమాంతర రిజర్వేషన్‌ అందిస్తాం’ అని తెలిపారు. అలాగే కానిస్టేబుల్, మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, జైల్ వార్డెన్, ఎస్పీవో పోస్టులకు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో 10 శాతం సమాంతర రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు అగ్నివీర్‌లను నియమించుకునే పారిశ్రామిక సంస్థలకు రాయితీ ఇస్తామని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ తెలిపారు. ‘ఏదైనా పారిశ్రామిక సంస్థ అగ్నివీర్‌కు నెలకు రూ.30,000 కంటే ఎక్కువ జీతం ఇస్తే, మా ప్రభుత్వం ఆ పారిశ్రామిక యూనిట్‌కు సంవత్సరానికి రూ. 60,000 సబ్సిడీ ఇస్తుంది’ అని ప్రకటించారు.