భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన

భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన
భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన సాగిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. వైసీపీ నాయకులు మూడు రాజధానులని మభ్య పెట్టి మూడు ప్రాంతాలలో అన్ని రకాల భూముల దోపిడీ చేశారని ఆరోపించారు.  వైసీపీ పాలనలో భూ ఆక్రమణలు , కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలను తెలియజేసిందని స్పష్టం చేశారు.
 
గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రభుత్వ, అటవీ, దేవాలయ, ప్రజల స్వార్జిత భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయని మండిపడ్డారు. నీతి అయోగ్ డ్రాఫ్ట్ సూచనలను పక్కదోవ పట్టిస్తూ జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. ప్రజల, ప్రభుత్వ భూముల రక్షణ కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనను ఆయన స్వాగతించారు.
 
వైసీపీ పాలనలో లక్షల ఎకరాల పేదల డీకే భూముల దోపిడీకి తెరలేపారని పేర్కొంటూ దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. చుక్కల భూములు 22ఏ క్రింద చూపుతూ వాస్తవ యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారం సత్వరం అవసరమని స్పష్టం చేశారు. 
 
చుక్కల భూముల సమస్య ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు చాల ఎక్కువ ఉందని తెలిపారు. గత అయిదు సంవత్సరాలలో రాష్ట్రంలో వేలాది ఎకరాలకుపైగా దేవాలయాల భూముల రికార్డులు తారుమారు చేశారని చెప్పారు. సింహాచలం దేవాలయ భూములను అన్యాక్రాంతం చేశారని విమర్శించారు.
 
సింహాచలం దేవాలయ గెస్ట్ హౌస్‌లో తమిళనాడు నుంచి వచ్చిన కార్తీక్ సుందర రాజన్ అనే వ్యక్తి దేవాలయల భూముల రికార్డులను తారుమారు చేసిన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అన్నవరం, ఇంద్రకీలాద్రి దేవాలయాల భూముల అక్రమణ, కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని ఉన్నాయని చెప్పారు. తిరుపతిలోని హాదిరాం మఠం భూములు గందరగోళం అయ్యాయని బీజేపీ నేత వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రతి దేవాలయం భూముల రికార్డులను పరిశీలించి కబ్జాలకు గురైన, అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తేవాల్సి ఉందని దినకర్ స్పష్టం చేశారు. పేదలకు ఇండ్ల పట్టాలని రాజమండ్రి ఆవ భూములు, కాకినాడ మడ అడవుల అక్రమాలు మాదిరిగానే రాష్ట్రం మొత్తం జరిగిన వైసీపీ అవినీతి చిట్టా బయట పెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. 

నాడు వైసీపీ ప్రజాప్రతినిధులు బెదిరింపులతో విశాఖపట్నంలో భూముల డెవలప్మెంట్ అగ్రిమెంట్లపైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోస్తాలో ఒంగోలులో దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, విజయవాడ, గుంటూరులో పైవేట్ ఆస్తులు కబ్జాలు, నెల్లూరులో క్వాట్జ్, సిల్లికా సంపదను దోచేశారని తెలిపారు. రాయలసీమలో ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు అస్మదీయులకు జగన్ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత అయిదు సంవత్సరాలుగా ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ క్వారీలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. జగన్ స్వంత జిల్లా కడపలో లో బెరైటీస్, సున్నపురాయి త్రవ్వకాల అక్రమాలు ఆకాశాన్ని తాకాయని తెలిపారు. సహజ వనరులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని పక్కన పెట్టి అనుయాయులకు సర్వ సంతర్పణ చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైసీపీ పార్టీ ఆఫీసుల కోసమని జిల్లాకొక ప్యాలెస్ నిర్మాణం కోసం అక్రమ భూ కేటాయింపులు చేసి దేశంలో రాజకీయ పార్టీ ఆఫీసుల నిర్మాణంలో జగన్  అవినీతి రికార్డు సృష్టించారని విమర్శించారు.  వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడం తప్పు కాదు, కానీ ప్రభుత్వ భూములను కేటాయించిన తీరు చూస్తే రాచరిక విధానం ప్రతిబింబిస్తుందని లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.