సుప్రీం కోర్టుకు మొదటిసారి మణిపూర్ నుండి న్యాయమూర్తి

సుప్రీం కోర్టుకు మొదటిసారి మణిపూర్ నుండి న్యాయమూర్తి
జమ్మూకశ్మీర్, లడఖ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎన్ కోటేశ్వర్ సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్ మహదేవన్ లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ఈ ఇద్ద‌రు జ‌డ్జీల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించాల‌ని ఇటీవ‌ల సుప్రీంకోర్టు కొలీజియం ప్ర‌తిపాద‌న‌లు చేసింది. ఈ కొత్త నియామ‌కాల‌తో సుప్రీంకోర్టు జ‌డ్జీల సామ‌ర్థ్యం 34కు చేరుకున్న‌ది.

జస్టిస్ హెచ్ఎన్ కోటేశ్వర్ సింగ్ గత ఏడాది ఫిబ్రవరి 12న జమ్మూకశ్మీర్, లడఖ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ హెచ్ఎన్ కోటేశ్వర్ సింగ్ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ కు చెందిన వారు. ఈ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా నియమితులైన తొలి వ్యక్తిగా జస్టిస్ సింగ్ నిలిచారు. 

1963 మార్చి 1న మణిపూర్ లోని ఇంఫాల్ లో జన్మించిన జస్టిస్ సింగ్ మణిపూర్ తొలి అడ్వొకేట్ జనరల్ గా పనిచేసిన గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. ఇబోతోంబి సింగ్ కుమారుడు. గౌహతి హైకోర్టుకు మారడానికి ముందు జస్టిస్ హెచ్ఎన్ కోటేశ్వర్ సింగ్ సుప్రీంకోర్టులో కొంతకాలం ప్రాక్టీస్ చేశారు. 

2008లో గౌహతి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన ఆయన 2011లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2012లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో మణిపూర్ హైకోర్టు ఏర్పాటైనప్పుడు జస్టిస్ హెచ్ఎన్ కోటేశ్వర్ సింగ్ అక్కడ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

2018లో గువాహటి హైకోర్టుకు బదిలీ కావడంతో  ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్   నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన కొలీజియం జూలై 12న ఏకగ్రీవంగా జస్టిస్ హెచ్ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సిఫారసు చేసింది.

మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆర్ మహదేవన్ వెనుకబడిన వర్గానికి చెందినవారు. మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1989లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 25 ఏళ్ల పాటు పరోక్ష పన్నులు, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ వ్యవహారాలపై దృష్టి సారించి సివిల్, క్రిమినల్, రిట్ కేసుల్లో స్పెషలైజేషన్ చేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.