డీకేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

డీకేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

అక్రమాస్తులు కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిబిఐ కేసు పూర్తిగా చట్టవిరుద్ధమని శివకుమార్‌ తరపున న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గీ, విపిన్‌ సంఘీలు జస్టిస్‌ బేలా ఎం. త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.

ఈ అభియోగాలు తీవ్రమైనవి, అవినీతి నిరోధక (పిసి) చట్టం కింద నేరాలకు సంబంధించినవి అని జస్టిస్‌ త్రివేది పేర్కొన్నారు. పిసి చట్టంలోని సెక్షన్‌ 17ఎని సిబిఐ అనుసరించలేదని రోహిత్గీ వాదించారు. సెక్షన్‌ 17ఎ నిబంధన ప్రకారం.. తగిన అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా పిసి చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారిపై ఆరోపించిన నేరంపై పోలీసు అధికారి ఎటువంటి విచారణ, లేదా దర్యాప్తు చేపట్టకూడదని రోహిత్గీ పేర్కొన్నారు.

ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే విచారణ జరుపుతున్న ఇదే అంశంపై సిబిఐ ఏకకాలంలో దర్యాప్తు ప్రారంభిచకూడదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్‌ త్రివేది సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయలేమని పేర్కొన్నారు.  సిబిఐ కేసును రద్దు చేయాలన్న రోహిత్గీ వాదనను తోసిపుచ్చారు.  సిబిఐ కేసును కొట్టివేసేందుకు గతేడాది అక్టోబర్‌లో కర్ణాటక హైకోర్టు కూడా  నిరాకరించిన సంగతి తెలిసిందే. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదని పేర్కొంది

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ డీకే వేసిన పిటిషన్‌ను 2023 అక్టోబర్ 19న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణను పూర్తి చేసి మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డీకే 2013-2018 మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సీబీఐ అభియోగం. దీనిపై 2020 సెప్టెంబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021లో ఈ ఎఫ్ఐఆర్‌ను హైకోర్టులో డీకే శివకుమార్ సవాలు చేశారు.