వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తొలగింపు… ఏఐ పై `రోబోట్ టాక్స్’

వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తొలగింపు… ఏఐ పై `రోబోట్ టాక్స్’
* బడ్జెట్ కు కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్ సూచన
 
రైతులకు వ్యవసాయ పరికరాలపై ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లేదా జీఎస్టీ తొలగింపు, ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే కంపెనీలకు పన్ను రాయితీ, మానవశక్తి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే కంపెనీలపై ‘రోబోట్ ట్యాక్స్’, పీఎం  కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కేటాయింపుల పెంపు, ఆవులపై పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చే కేంద్రీయ వ్యవసాయ విద్యాలయాలకు నిధుల కేటాయింపు వంటి పలు సూచనలను ఆర్ఎస్ఎస్ సంబంధిత సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చేశాయి.
 
2024-25 బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం) మరియు భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) వంటి సంస్థలు చేసిన సూచనలతో ఇవి ఉన్నాయి. జులై 23న ప్రవేశపెట్టే బడ్జెట్ తయారీలో భాగంగా  ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ వివిధ సంస్థలు, నిపుణులతో వరుసగా జరిపిన సమాలోచనలలో ఈ సంస్థలు ఈ సూచనలను ఆమె ముందుంచాయి
 
భారతీయ కిసాన్ సంఘ్ చేసిన సూచనలలో, ఇతర తయారీదారుల మాదిరిగానే రైతులు తప్పనిసరిగా జీఎస్టీ కింద ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొందాలని లేదా వారి ఇన్‌పుట్‌లు, ట్రాక్టర్ వంటి వ్యవసాయ పరికరాలను తప్పనిసరిగా పన్ను రహితంగా చేయాలని స్పష్టం చేసింది.
 
“జీఎస్టీ ప్రాథమిక లక్షణాలలో ఒకటి దేశం అంతటా, వస్తువుల కదలిక అంతటా (వస్తువుల తయారీ నుండి, వాటి వినియోగం వరకు) ఇన్‌పుట్ క్రెడిట్ ఒకేవిధంగా ఉండాలి. రైతులు ఉత్పత్తిదారులు. పంటలను ఉత్పత్తి చేయడానికి వారు ఉపయోగిస్తున్న చాలా ఇన్‌పుట్‌లపై జీఎస్టీ వ్యవస్థలో అధికంగా పన్నులు విధిస్తున్నారు. రైతులకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లభించడం లేదు” అని బి కె ఎస్ ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా తెలిపారు.
 
 “కాబట్టి, రైతులకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందడానికి కొంత నిబంధన ఉండాలి, లేదా అన్ని వ్యవసాయ ఇన్‌పుట్‌లు, పనిముట్లను జీఎస్టీ రహితంగా చేయాలి” అని మిశ్రా స్పష్టం చేశారు. ఎరువులు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు నేరుగా డీబీటీ ద్వారా రైతుకే రావాలని, కంపెనీలకు ఇవ్వవద్దని బీకేఎస్‌ డిమాండ్‌ చేసింది.
 
స్వదేశీ జాగరణ్ మంచి చేసిన సూచనలలో కంపెనీలు సృష్టించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా ఆటోమేషన్ కారణంగా ఉద్యోగులను తొలగించే కంపెనీలపై ‘రోబోట్ పన్ను’ విధించడం వంటివి ఉన్నాయి. “నిరుద్యోగం ఒక సమస్య. కుత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. బీపీఓలు, సాఫ్ట్‌వేర్‌లు, మీడియాలో ఉద్యోగాలు కోల్పోతున్నారు” అని ఎస్ జె ఎం కో-కన్వీనర్ అశ్వని మహాజన్ చెప్పారు.
 
” నేడు ప్రపంచవ్యాప్తంగా రోబో ట్యాక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. (ఆర్థిక మంత్రితో) సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. మానవశక్తి స్థానంలో ఏఐని ఉపయోగించే కంపెనీలపై ఇటువంటి పన్ను విధించాలి. ఈ విధంగా సంపాదించిన ఆదాయాన్ని వ్యక్తుల నైపుణ్యానికి ఉపయోగించవచ్చు. మీరు దీన్ని వెంటనే అమలు చేయాలని నేను చెప్పడం లేదు, కానీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలి,” అని మహాజన్ సూచించారు.
 
అదేవిధంగా ఉద్యోగాల కల్పన ప్రాతిపదికన మహాజన్ కూడా పన్ను విధించాలని ఆయన చెప్పారు. “ఈరోజు, రూ.100 కోట్లు సంపాదించి 10 మందికి ఉపాధి కల్పించే కంపెనీ, రూ. 10 కోట్లు సంపాదించి 200 మందికి ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ ఒకే పన్ను (శాతం పరంగా) చెల్లించాలి. మనకు ఉద్యోగాలు-పన్ను నిష్పత్తిని పరిగణలోకి తీసుకొంటున్నామా?” అని మహాజన్ ప్రశ్నించారు.
 
 భారత ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్త అయిన సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎమ్ఇ) రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాల (పీఎల్ఐ)  పథకాన్ని విస్తరించాలని ఎస్ జె ఎం  సూచించింది.
 
కాగా,  రైతులకు ఇన్‌పుట్ ఖర్చు పెరిగినందున కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయింపులు పెంచాలని బికెఎస్ తన సూచనలలో పేర్కొంది. “దేశీయ ఆవు, మేక మొదలైన వాటి పరిశోధన, అభివృద్, పంపిణీకి తగిన బడ్జెట్, ఆవు ఆధారిత కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బడ్జెట్ కేటాయింపు” కూడా డిమాండ్ చేసింది.
 
 “వ్యవసాయ పరిశోధన, అభివృద్, విస్తరణ కోసం బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయాలి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి  వంటి సంస్థలు పరిశోధన కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వత్తిడిని ఎదుర్కొవు” అని మిశ్రా అన్నారు.