
సంవిధాన్ హత్య దివస్’ పాటించడం భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినప్పుడు ఏమి జరుగుతుందో గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నివాళులు అర్పించే రోజు కూడా ఇదేనని, భారత చరిత్రలో కాంగ్రెస్ చీకటి దశను ఈ ‘రాజ్యాంగ హత్యా దినం’ ఆవిష్కరించిందని ప్రధాని తెలిపారు.
ఎమర్జెన్సీ కాలంలో అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ నివాళులు అర్పించేందుకు, అధికార దుర్వినియోగానికి ఏ విధంగానూ మద్దతివ్వవద్దని భారత ప్రజలను తిరిగి గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 25ను ‘సంవిధాన్ హత్య దివస్’గా పాటించాలని నిర్ణయించామని కేంద్రం తెలిపింది. భారత ప్రజలకు రాజ్యాంగంపై, ప్రజాస్వామ్య శక్తిపై అచంచల విశ్వాసం ఉందని తెలిపింది.
‘సంవిధాన్ హత్యా దివస్’ పాటించడం ద్వారా ప్రతి భారతీయుడిలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణ అనే శాశ్వత జ్వాల సజీవంగా ఉంటుందని, తద్వారా కాంగ్రెస్ వంటి నియంతృత్వ శక్తులు ఆ భయానక పరిస్థితులను పునరావృతం చేయకుండా నిరోధించవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తూ దేశంపై ఎమర్జెన్సీని విధించడం ద్వారా మన ప్రజాస్వామ్య ఆత్మను గొంతు నులిమి చంపేశారని అమిత్ షా తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
తమ తప్పేమీ లేకుండా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని మండిపడ్డారు. అణచివేత ప్రభుత్వం చేతిలో వివరించలేని హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అమిత్ షా తెలిపారు.
ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీ కాలాన్ని ఖండించగా, ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.
రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కొద్దిసేపటికే ఇందిరా గాంధీ ఈ సంచలన నిర్ణయించారు.
మరోవైపు ఎమర్జెన్సీ విధించిన రోజును రాజ్యాంగ హత్యాదినంగా నిర్వహించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇది కేవలం హెడ్లైన్లలో నిలవడానికి ప్రధాని మోదీ వేసిన ఎత్తుగడగా అభిప్రాయపడింది. పదేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీని జూన్ 4న నైతికంగా ప్రజలు ఓడించారని, ఆ రోజు మోదీ ముక్త్ దివస్గా చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవా చేసింది. ఈ నిర్ణయం దేశ రాజ్యాంగం విలువలు, సంప్రదాయాలు, సంస్థలపై క్రమబద్దంగా చేస్తున్న దాడి అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు