
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డిమాండ్ చేసింది. జీవిత ఖైదు విధిస్తూ గత ఏడాది మే నెలలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. గురువారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఇది విచారణకు వచ్చింది. అయితే జస్టిస్ అమిత్ శర్మ విచారణ నుంచి తప్పుకున్నారు.
దీంతో ఢిల్లీ హైకోర్టులోని మరో బెంచ్‌లో విచారణ కోసం ఆగస్టు 9న లిస్టింగ్ చేశారు. కాగా, గతంలో జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, జస్టిస్ తల్వంత్ సింగ్‌లతో కూడిన బెంచ్ ముందుకు ఈ కేసు విచారణ వచ్చింది. కేసును స్వయంగా వాదించుకున్న యాసిన్ మాలిక్ తీహార్ జైలులో ఉండటంతో జైలు సూపరింటెండెంట్ ద్వారా ఆయనకు కోర్టు నోటీస్ చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు రికార్డు కోసం కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
మరోవైపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్‌ఐఏ తరపున ఢిల్లీ హైకోర్టులో వాదించారు. నలుగురు ఐఏఎఫ్ సిబ్బంది హత్య, రుబయ్యా సయీద్‌ని కిడ్నాప్‌కు యాసిన్ మాలిక్ కారణమని ఆరోపించారు. ఆయుధాల్లో శిక్షణ పొందేందుకు యాసిన్ మాలిక్ 1980లో పాకిస్థాన్‌కు వెళ్లాడని కోర్టుకు తెలిపారు.
జేకేఎల్‌ఎఫ్ చీఫ్ అయ్యేందుకు ఐఎస్‌ఐ అతడికి సహాయం చేసిందని ఆరోపించారు. ఇలాంటి భయంకరమైన టెర్రరిస్ట్ తన నేరాన్ని అంగీకరించిన కారణంగా ఉరి శిక్ష విధించకపోతే ఉగ్రవాదులు మరణ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కలుగుతుందని కోర్టులో వాదించారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి