నీట్ పేపర్ లీక్‌ కేసులో మరో నిందితుడి అరెస్ట్

నీట్ పేపర్ లీక్‌ కేసులో మరో నిందితుడి అరెస్ట్
* యూజీసీ-నెట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కాలేదు
నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అదుపులోకి తీసుకుంది. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అతను నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్‌కు పంపాడు.
 
రాకీని పట్టుకునేందుకు పట్నా, కోల్‌కతా సమీపంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. అతని భార్య ఇమెయిల్ ఐడి ఐపీ అడ్రస్ ద్వారా రాకీని పట్టుకోగలిగారు. అరెస్టు అనంతరం కోర్టులో రాకీని హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం సీబీఐ అతనికి10 రోజుల రిమాండ్‌ను మంజూరు చేసింది. అతను ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

బిహార్‌ రాష్ట్రం మలందాకు చెందిన మాస్టర్ మైండ్ సంజీవ్ ముఖియాతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే ఇద్దరు అనుమానితులైన సన్నీ, రంజిత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. సన్నీ విద్యార్థి కాగా, రంజిత్ ఓ విద్యార్థి తండ్రి. వీరిని ఆరు రోజుల రిమాండ్‌కు తరలించారు. వారిని విచారిస్తుండగానే రాకీ గురించి తెలిసింది.

హజారీబాగ్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌ నుంచి పేపర్‌ లీక్‌ జరిగిందని విచారణలో తేలింది. సంజీవ్ ముఖియా పరీక్ష పత్రాలను అందుకున్నాడు. వాటిని ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న నిందితుడు చింటూ మొబైల్‌కు ఫార్వార్డ్ చేశాడు. చింటూ, రాకీ.. పట్నాలోని లెర్న్ ప్లే స్కూల్‌లో ప్రశ్నలు, సమాధానాలను విద్యార్థులకు షేర్ చేశారు.

మరోవంక, ‘యూజీసీ-నెట్‌’ ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో సంచలన అంశాలు వెల్లడయ్యాయి! ఆ ప్రశ్నపత్రం అసలు లీక్‌ కాలేదని.. టెలిగ్రామ్‌ చానళ్లలో వైరల్‌ అయిన ప్రశ్నపత్రం స్ర్కీన్‌షాట్‌పై తేదీని ఓ యాప్‌ సాయంతో మార్చారని సీబీఐ దర్యాప్తులో తేలింది. దీని వెనుక ఒక పాఠశాల విద్యార్థి ఉన్నాడని, ఒక యాప్‌ సాయంతో ఆ విద్యార్థి తయారుచేసిన స్ర్కీన్‌ షాట్లను ఒక వ్యక్తి సర్క్యులేట్‌ చేశాడని వెల్లడైంది. 

ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి అనధికారికంగా తీసుకెళ్లిన సీబీఐ ఆ వ్యక్తిపై చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు, చీటింగ్‌ కేసు పెట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం. వర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషి్‌పకు అర్హత సాధించడానికి ఏటా నిర్వహించే యూజీసీ-నెట్‌ను కేంద్రం ఈ ఏడాది జూన్‌ 18న నిర్వహించిన సంగతి తెలిసిందే. 

దేశవ్యాప్తంగా 317 నగరాల్లో 1205 పరీక్షా కేంద్రాల్లో 11 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఆరోజు ఈ పరీక్షను రెండు సెషన్లలో (ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 దాకా ఒక సెషన్‌. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల దాకా రెండో సెషన్‌) నిర్వహించారు.