
రాష్ట్రంలో దాదాపు రూ. 70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం,పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు.
భేటి వివరాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశానికి తూర్పు తీరంగా ఉన్న రాష్ట్రంలో గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5,000 ఎకరాల భూమి అవసరమవుతున్నందున 90 రోజుల్లో సాధ్యాసాధ్యాలపై వివరణాత్మక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదిక కోరినట్లు వెల్లడించారు.
అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్టుతో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. ఇబ్బంది లేని పద్ధతిలో సౌకర్యాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురుచూస్తోందని ఆయన స్పష్ఠం చేశారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం అని, సంస్థలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వారికి వివరించారు.
మరోవంక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయవలసిందిగా విన్ ఫాస్ట్ సీఈవోను ఆహ్వానించిన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ సీఈవో ఫామ్ సాన్ చౌతో సానుకూల చర్చలు జరిగాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూమి పరిశీలించాలని పరిశ్రమల శాఖను అదేశించారు. విన్‌ఫాస్ట్ నుంచి సానుకూల సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు