పథకాల పేరిట తెస్తున్న అప్పులు ఏం చేస్తున్నారు?

పథకాల పేరిట తెస్తున్న అప్పులు ఏం చేస్తున్నారు?

అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు అనేక హమీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ప్రసంగించారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీని పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎక్కడికిపోయాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్నారు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.

18ఏళ్లు నిండిన మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, వివాహం చేసుకునే మహిళలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌ ఎప్పటి నుంచి ఇస్తారు? అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నా మహిళలకు న్యాయం జరగలేదని, అయితే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. 

నరేంద్ర మోదీ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని చెబుతూ అమలు చేయలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని చెప్పారు.  మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి బస్సులు తగ్గించారని విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డల తరఫున ప్రశ్నించే బాధ్యత మేము తీసుకున్నామని పేర్కొంటూ హామీల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

హామీల పేరిట అధికారంలో వచ్చిన కర్ణాటకలో కూడా హామీలు అమలు చేయట్లేదని కిషన్ రెడ్డి తెలిపారు. హామీల అమలు పేరుతో ప్రభుత్వం ప్రజల సొమ్ము దోచుకుంటుందని, రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారని, అది రాహుల్‌ పర్యటనల కోసం ఉపయోగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నించారు. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

స్వరాష్ట్రం వచ్చి పదేళ్లైనా కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదని చెబుతూ కొత్త రేషన్‌ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు? అని నిలదీశారు. రేషన్‌ కార్డు లేకపోవడంతో మహిళలు గ్యాస్‌ కనెక్షన్లు తీసుకోలేకపోతున్నారని తెలిపారు.  కొత్త రేషన్‌ కార్డులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అని నిలదీశారు. రేషన్‌ కార్డు ఉంటే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా తెలంగాణ పేరుమీద రేషన్‌ ఇచ్చుకోలేని దురవస్థలో ఉన్నామని మండిపడ్డారు.