మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం దంపతులు సహా తొమ్మిది మందిపై మైసూరులోని విజయనగర్ పోలీస్ స్టేషన్లో సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశారు. భూకేటాయింపుల కుంభకోణంలో సీఎం సహా ఆయన సతీమణి పార్వతమ్మ, ముడా అధికారులతోపాటు మైసూరు జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారిపై చర్యలు తీసుకోవాలని స్నేహమయి డిమాండ్ చేశారు. అయితే ముడా అవకతవకలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సిద్దరామయ్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర రూ. 4000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ ఆరోపిస్తోంది.
సొంత జిల్లా మైసూరులో సీఎం తన సతీమణి పార్వతమ్మ పేరిట చట్టవిరుద్ధంగా కోట్ల విలువజేసే భూములు కేటాయించుకొన్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ ఆరోపించారు. ఈ కుంభకోణంలో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ఉన్నతాధికారులు ప్రమేయం కూడా ఉన్నదన్నారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకే వారిని ప్రభుత్వం ఉన్నట్టుండి బదిలీపై పంపించిందని ఆరోపించారు. ఈ కుంభకోణం వివరాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే సీబీఐతో లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.బీజేపీ నేతల ఆరోపణల ప్రకారం మైసూరు శివారుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సిద్దరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాల 16 గుంటల భూములు ఉన్నాయి. అయితే, అవసరాల దృష్ట్యా ఆ భూములను సేకరించిన ప్రభుత్వం వాటికి బదులుగా నగరంలోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకొనే విజయనగర్, దట్టగల్లీ, జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచయా-సతాగల్లీలో సిద్దు కుటుంబానికి భూములను కేటాయించింది.
50:50 నిష్పత్తిలో (పడావు పడ్డ ఒక ఎకరా తీసుకొంటే, అభివృద్ధి చేసిన అర్ధ ఎకరం ఇవ్వడం) ఈ భూముల కేటాయింపు జరిగింది. అయితే, సిద్దు కుటుంబానికి అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఆ భూములను కేటాయించాలని ఎవరు సిఫారసు చేశారని ఆర్ అశోక్ నిలదీశారు. క్యాబినెట్ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందని, ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతల ఆరోపణలను సీఎం సిద్దరామయ్య ఖండించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. రింగ్రోడ్డుకు సమీపంలో తన భార్య పేరిట 3.16 ఎకరాల భూమి ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
తమ 3.16 ఎకరాలను సేకరించకుండానే ముడా అధికారులు అక్కడ లే అవుట్ వేశారని చెప్పారు. ఆ స్థలాలను లబ్ధిదారులకు పంపిణీ కూడా చేశారని తెలిపారు. చట్ట ప్రకారం తమ భూములకు బదులుగా 50:50 ప్రాతిపదికన వేరేచోట భూములు ఇస్తామని ముడా అంగీకరించిందని చెప్పారు. ఇదంతా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెబుతూ ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు