2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్

2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్
2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టును అందుబాటులోకి తెస్తామ‌ని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె. రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని మంత్రిగా మొదటిసారి సందరిస్తూ గురువారం ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
 
భోగాపురంలో  ప్ర‌యాణికుల‌తో పాటు 50వేల ట‌న్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే విధంగా కార్గో టెర్మిన‌ల్ కూడా నిర్మిస్తున్న‌ట్టు చెప్పారు. ఎయిర్‌పోర్టుతో పాటు ఎం.ఆర్‌.ఓ. విభాగం కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని, దేశంలోనే నెంబ‌ర్‌వ‌న్ ఎయిర్‌పోర్టుగా భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని రూపొందించే దిశ‌గా కృషిచేస్తున్నామ‌ని మంత్రి పేర్కొన్నారు.
 
ప్ర‌స్తుత విశాఖ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 28 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తుండ‌గా 2026 నాటికి కొత్త‌గా ప్రారంభించే భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా ప్రారంభంలోనే 50 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి చెప్పారు. ఈ విమానాశ్ర‌యాన్ని 60 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించే సామ‌ర్ధ్యంతో నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్ పోర్టు గుండెకాయ వంటిదని అభివర్ణించారు. 
 
నిర్ణీత సమయంలోనే భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామని చెప్పారు.  కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం విమానాశ్రయ పనులను ఆలస్యం చేసిందని ఆరోపించారు. డిసెంబరు నాటికి టెర్మినల్ భవనం పూర్తి చేస్తామని చెప్పారు. చిన్న చిన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు.విమానాశ్రయం పూర్తయితే దాదాపు 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వారే కాకుండా ఒడిశా వాసులకు కూడా భోగాపురం ఎయిర్ పోర్టు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే, భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు ఎన్నో కంపెనీలు వస్తాయని తెలిపారు.