జగన్ పాలనలో విద్యుత్ రంగానికి రూ.47 వేల కోట్ల నష్టం

జగన్ పాలనలో విద్యుత్ రంగానికి రూ.47 వేల కోట్ల నష్టం
ఐదేళ్లలో విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని చెబుతూ చేతకాని పరిపాలన వల్ల ఈ కాలంలో విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.47,741 కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.  మంగళవారం విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, దేశంలోనే మొట్టమొదటి సారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేశారు. 
 
వైసీపీ ప్రభుత్వ కరెంటు బాదుడు తెలిస్తే, కరెంటు షాక్ కొట్టాల్సిందే అని పేర్కొంటూ 2019తో పోల్చుకుంటే, 2024కి 98 శాతం కరెంటు బిల్లులు పెరిగాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచి, పేదవాడిని పీక్కుతిందని విమర్శించారు. 2014-2019 మధ్య విద్యుత్ ఉత్పత్తి పెంచి, కరెంటు బిల్లు పెంచకుండా, నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.

“2019-2024 మధ్య ఒక అసమర్థుడు వచ్చి  విద్యుత్ రంగం అప్పు రూ. 1,29,500 కోట్లు చేశాడు. 9 సార్లు విద్యుత్ ఛార్జీల బాదుడు ఇందుకే. 2019-2024 మధ్య తన స్వార్ధ ప్రయోజనాల కోసం, పీపీఏలని రద్దు చేసి, పెట్టుబడిదారులపై కక్ష సాధించి, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీశారు” అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. 

“5 ఏళ్లు సీఎం ఆఫీస్ కి కూడా వచ్చినట్టు లేరు. ఆ గదిలో కమోడ్ లు, ఏసీలు కూడా పని చేయని పరిస్థితి. పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. చేతకాని పరిపాలన వల్ల, గత 5 ఏళ్లలో విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.47,741 కోట్లు” అని వివరించారు.

2004లో తాను అధికారం కోలోపాయినా తాను విద్యుత్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలబడిందని చెప్పారు. సోలార్ విద్యుత్ వినియోగించకుండా రూ.9 వేల కోట్లు చెల్లించారని చెబుతూ గత 5 ఏళ్లు మొత్తం రూ.32,166 కోట్లు ప్రజలపై అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

వైసిపి ప్రభుత్వంలో  గృహ వినియోగదారులపై రూ.8,180 కోట్ల భారం వేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం పవర్ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా రూ.4,700 కోట్లు నష్టం వచ్చిందని, జగన్ పాలనలో, ఏపీ డిస్కం రేటింగులు పతనం అయ్యాయని విమర్శించారు.