జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి

జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌ హథ్రాస్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా మరో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో ఈ దుర్ఘటన జరిగింది. రథయాత్రకు లక్షలాది మంది జనం తరలివచ్చారు. ఈ క్రమంలోనే రథం లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
 
ఈ తొక్కిసలాట ఘటనలో  ఊపిరాడక ఒక భక్తుడు మరణించగా పలువురు   గాయపడ్డారు. పూరీలోని జగన్నాథ దేవాలయం నుంచి గుడించా దేవాలయం వరకూ 2.5 కి.మీ పొడవునా ఈ రధయాత్ర సాగింది.  వెంటనే అధికారులు, పోలీసులు స్పందించి.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
 దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు పూరీకి తరలి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చడం పూర్తి చేశారు.  సాయంత్రం 4 గంటలకు రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. ఆ తర్వాత బలభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది. 
 
ఈ క్రమంలోనే రథం లాగేందుకు భక్తులు ఎగబడటంతో వారి మధ్య తోపులాట జరిగింది. రథాలలో చెక్క గుర్రాలను ఉంచి.. భక్తులకు రథాలను సరైన మార్గంలో లాగేందుకు సేవాదారులు మార్గనిర్దేశం చేశారు. ఆ సమయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు ప్రదక్షిణ చేసి.. దేవతలకు నమస్కరించారు.
 
ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలోని శుక్లపక్షం ద్వితీయ తిథిన పూరీ జగన్నాథ రథ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ద్వితీయ తిధి 4.26 గంటలకు ప్రారంభమైన ఈ రథయాత్ర సోమవారం ఉదయం 4.59 గంటలకు ముగియనుంది. పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకల్లా ఈ పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకమైంది. 
 
ఇక ఈ పూరీ జగన్నాథ రథయాత్రకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ రథయాత్ర.. ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు.