గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం
హైదరాబాద్‌ నగరంలో ఆషాఢ మాస బోనాలు మొదలయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం ఆదివారం సమర్పించారు. లంగర్‌ చౌరస్తాలో డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో తొట్లు, రథంతో ఊరేగింపుగా బోనాలను ప్రారంభించారు.
 
గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్‌ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. 
 
దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈ సారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. తొలిపూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా అమ్మవారికి డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో కొండపైకి తొట్లు, రథం ఊరేగింపు నిర్వహించారు. పోతురాజులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా నృత్యాలు చేయడం ఆకట్టుకుంది.  హైదరాబాద్‌, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా, బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి చెప్పారు. 
 
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.  గోల్కొండలో మొదలైన ఈ బోనాలు 9 వారాల పాటు ఘనంగా జరుగుతాయి. మళ్లీ గోల్కొండ కోటలనే బోనాలు ముగుస్తాయి.  ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. అనంతరం ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి.. 28, 29 తేదీల్లో లాల్‌ దర్వాజా బోనాలు జరగనున్నాయి.
 
అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు దేశ, విదేశాల సందర్శకులు తరలివస్తారు. ప్రతి ఆదివారం, గురువారం జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ బోనాల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 
 
బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం 600 మంది పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నామని, సీసీ కెమెరాల నిఘాలో బోనాలను పర్యవేక్షిస్తామని చెప్పారు. గోల్కొండ కోటకు వచ్చే వారికి మూడు ప్రాంతాల్లో పార్కింగ్‌ ఉంటుందని, సెవన్‌ టూంబ్స్‌ వద్ద ఓ పార్కింగ్‌, లంగర్‌హౌస్‌ హుడా పార్కు వద్ద పార్కింగ్‌, రాందేవ్‌గూడ దాటిన తర్వాత ఓ పార్కింగ్‌ ప్రదేశాన్ని కేటాయిస్తున్నామని వివరించారు. ప్రజలందరూ పోలీసులకు సహాయ సహకారాలు అందించి ప్రశాంత వాతావరణంలో బోనాలను జరుపుకోవాలని కోరారు.