
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్థానిక అధికారులు చార్ధామ్ యాత్రను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేశారు. గర్వాల్ రీజియన్‌లో ఆది, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆదివారం యాత్రను ఆపేశారు. యాత్రికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని గెర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
యాత్రికులు రుషికేశ్‌ను దాటివెళ్లవద్దని, ఇప్పటికే యాత్రలో ఉన్న వాళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోవాలని హెచ్చరించారు. వాతావరణ శాఖ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు యాత్రను కొనసాగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విష్ణుప్రయాగ్ వద్ద అలకనంద నది ప్రమాదస్థాయికి దగ్గరగా ప్రవహిస్తున్నది.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో బద్రీనాథ్‌కు వెళ్లే మార్గంలో పలుచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు బద్రీనాథ్‌కు వెళ్లి మోటార్‌సైకిల్‌పై తిరిగి వస్తుండగా కొండచరియలు పడి దుర్మరణం పాలయ్యారు. రుషికేశ్‌లోని గంగానదిలో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరుకోవటంతో తీరప్రాంతంలోని ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించారు.
More Stories
మూడో తరగతి నుంచే ఏఐ!
వాట్సప్ లేకపోతేనేం.. అరట్టై వాడండి
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి