వారానికోసారి మాత్రమే ఇచ్చే ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌!

దేశంలో పది కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి వీళ్లందరూ రోజూ ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ను ఇప్పించుకోవాల్సి వస్తున్నది. ఒక్కరోజు మిస్‌ అయినా ప్రాణాపాయం సంభవించే పరిస్థితి. ఇలాంటి సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు డెన్మార్క్‌కు చెందిన ఫార్మా కంపెనీ నోవో నోర్డిస్క్‌ శుభవార్త చెప్పింది. 

రోజుకు బదులు వారానికోసారి ఇచ్చే ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ‘ఐకోడెక్‌’ను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. ఇప్పటికే యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎఏ) అనుమతులను పొందిన ఈ ఇంజెక్షన భారత్‌లోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్సీవో) ఆధ్వర్యంలోని సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (సీఈసీ) పరిశీలనకు వచ్చింది. 

ఒకవేళ అనుమతులు లభిస్తే, త్వరలోనే భారత మార్కెట్లోకి ఐకోడెక్‌ వచ్చే అవకాశమున్నది. కాగా స్థూలకాయుల బరువును తగ్గించడంలో సాయపడే ఒజెంప్టిక్‌ డ్రగ్‌ను కూడా నోవో నోర్డిస్క్‌ కంపెనీనే తయారు చేయడం గమనార్హం. సరిపడినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోకపోవడంతో వరుసగా టైప్‌-1, టైప్‌-2 డయాబెటిస్‌లు వస్తాయి. 

దీన్ని నివారించాలంటే, చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్‌ రోజువారీగా అవసరపడుతుంది. అయితే, ఐకోడెక్‌ ద్వారా ఇన్సులిన్‌ను వారానికి సరిపడే మోతాదులో ఒకే డోసు ఇంజెక్షన్‌గా తీసుకొంటే సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదమున్నదన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై గత ఏడాది జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. 

ఐకోడెక్‌ ద్వారా వారానికి సరిపడే విధంగా ఇన్సులిన్‌ను ఇచ్చినప్పుడు ఆ ఇన్సులిన్‌ అంతా రక్తంలోని ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌లో ఇన్‌యాక్టివ్‌ స్టోరేజీలో నిల్వ ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. రక్తంలో చక్కెర స్థాయిలు మారినప్పుడు ప్రతీరోజూ కొద్దికొద్దిగా ఇన్సులిన్‌ వారంపాటు విడుదల అవుతుందని వెల్లడించారు. ఈ ఇంజెక్షన్‌ను చర్మం కింద ఇస్తామని వివరించారు.