ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు

ఏపీకి  ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ఏళ్ల తరబడి వినిపిస్తుంది. ఎన్డీఏ-1లో టీడీపీ భాగస్వామి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని 2019లో అధికారం చేపట్టారు. గత ఐదేళ్లు ప్రత్యేక హోదా కోసం చాలా సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. కానీ ప్రత్యేక హోదా అందని ద్రాక్షలా మిగిలిపోయింది. 

ఇక 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారడంతో ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టే తరుణం ఇదే అంటూ టిడిపిపై రాజకీయంగా వత్తిడి పెరుగుతుంది. అయితే ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు టిడిపి నేతలు ఎవ్వరూ ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదు. 

కానీ, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి  నితీశ్ కుమార్ సైతం ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి వచ్చింది.

ప్రత్యేక హోదాపై మరోసారి చర్చ మొదలవ్వడంతో కేంద్ర మంత్రి, బిజెపి ఎంపీ  భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పందించారు. కేంద్ర, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వమే ఉందని గుర్తు చేశారు. అందుచేత,  ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదని స్పష్టం చేశారు. తీర్మానాలతో ప్రత్యేక హోదా వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇలా చేస్తాయని పేర్కొన్నారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా తన పరిధిలోని అంశం కాదని, దీనిపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. పైగా, బిహార్‌కు కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడంలేదో గతంలో ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా స్థానంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజి  ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 
 
ఆ నిధులతో ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యంతో పోలవరం ప్రాజెక్టు సమస్యల్లో కూరుకుపోయిందని చెబుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నాని హామీ ఇచ్చారు.