హాథ్రాస్ తొక్కిస‌లాట‌కు కారణమైన భోలే బాబా కోసం వెతుకులాట!

* 121కి చేరిన మృతుల సంఖ్య
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హాథ్రాస్‌లో బోలే బాబా స‌త్సంగ్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌()లో మృతిచెందిన వారి సంక్య 121కి చేరింది. ఆ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ‌వారి సంఖ్య 28గా న‌మోదు అయ్యింది. హాథ్రాస్ విషాదం ప‌ట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ సీరియ‌స్ అయ్యారు. తొక్కిస‌లాట‌కు కార‌ణ‌మైన వారిని శిక్షించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.
 
భోలే బాబా నిర్వ‌హించిన స‌త్సంగ్‌లో ఈ విషాదం చోటుచేసుకున్న‌ది.  మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3.30 నిమిషాల‌కు .. స‌త్సంగ్ ప్రాంగ‌ణం వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగింది. కానీ ఆ ఘ‌ట‌న త‌ర్వాత భోలే బాబా ఆన‌వాళ్లు దొర‌క‌డం లేదు. ఆయ‌న ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ బాబా కోసం వెతుకులాట ప్రారంభించారు.

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత బాబా వాహ‌నం వెంట జ‌నం ఉరికిన‌ట్లు తెలుస్తోంది. బాబా న‌డిచిన ప్ర‌దేశంలోని మ‌ట్టిని తీసుకోవాల‌న్న ఉద్దేశంతో ఆయ‌న అనుచ‌రులు ఎగ‌బ‌డ్డారు. ఆ స‌మ‌యంలోనే తీవ్ర‌మైన తొక్కిస‌లాట జ‌రిగింది. మ‌ట్టి కోసం కింద‌కు వంగిన స‌మ‌యంలో జ‌నం ఒక‌రిపై ఒక‌రు ప‌డ్డారు.

మెయిన్‌పురి జిల్లాలోని భోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిట‌బుల్ ట్ర‌స్టులో పోలీసులు సోదాలు చేశారు. అక్క‌డ ఆయ‌న ఆచూకీ చిక్క‌లేదు. ఎక్క‌డికి వెళ్లాడో తెలియ‌దు. విషాద ఘ‌ట‌న త‌ర్వాత ఆయ‌న కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయ‌న ఆశ్ర‌మంలో బాబాను క‌నుగొన‌లేద‌ని, ఆయ‌న ఇక్క‌డ లేర‌ని డిప్యూటీ ఎస్పీ సునిల్ కుమార్ తెలిపారు. 

అయితే ఆ బాబాపై ఎటువంటి కేసు న‌మోదు చేస్తార‌న్న విష‌యం ఇంకా తెలియ‌దు. కానీ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో నిర్వాహాకుడు దేవ్ ప్ర‌కాశ్ మ‌ధుక‌ర్‌పై కేసు బుక్ చేశారు.  ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన వారిపై భార‌తీయ న్యాయ సంహిత చ‌ట్టంలోని 105, 110, 126(2), 223, 238 సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

ఓ గ్రామ ప‌రిస‌రాల్లో జ‌రిగిన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. నిజానికి 80 వేల మంది వ‌ర‌కే అనుమతి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కేవ‌లం 40 మంది పోలీసులు మాత్ర‌మే ర‌క్ష‌ణ విధుల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

భోలే బాబా అస‌లు పేరు నారాయ‌ణ్ సాకార్ హ‌రి. తనను తాను దేవుడికి శిష్యుడిగా ప్రకటించుకొని ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తుంటాడు. తొక్కిస‌లాట‌లో మృతిచెందిన వారంతా ఈయ‌న భ‌క్తులే. నారాయ‌ణ్ హ‌రి స్వస్థలం యూపీలోని ఈటా జిల్లాలో బహదూర్‌ గ్రామం. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)లో పనిచేసిన‌ట్లు ఆయ‌నే చెప్పుకున్నారు. 
 
ఆధ్యాత్మిక జీవితం కోసం 26 ఏండ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేశానని చెబుతుంటాడు. ఆయన అనుచరులు అలీగఢ్‌లో ప్రతి మంగళవారం సత్సంగ్‌ నిర్వహిస్తుంటారు. కాషాయ వస్త్రాలు ధరించకుండా, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ.. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తుంటారు. ఖరీదైన అద్దాలు, తెల్లని సూట్‌, టై ధరించి ఈయన నిర్వహించే ‘సత్సంగ్‌’ కార్యక్రమాలకు పశ్చిమ యూపీలో భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా భోలే బాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు. భోలే బాబాను సూర‌జ్ పాల్ సింగ్ అని కూడా కొంద‌రు భ‌క్తులు పిలుస్తుంటారు. 

యూపీ పోలీసు శాఖ‌లో హెడ్ కానిస్టేబుల్‌గా చేశాడు. ఆ శాఖ‌తో అనుసంధాన‌మైన‌ ఇంటెలిజెన్స్ యూనిట్‌లో సుమారు 18 ఏళ్లు ప‌నిచేసిన‌ట్లు చెప్పుకుంటాడు. 1999లో స్వ‌చ్ఛంధ ప‌ద‌వీవిర‌మ‌ణ తీసుకున్నాడు. సూర‌జ్ పాల్ సింగ్ ణుంచి నారాయ‌ణ్ సాకార్ హ‌రిగా అత‌ని పేరు మార్చుకున్నాడు. ఆ త‌ర్వాత స‌త్సంగ్‌లు నిర్వ‌హించ‌డం మొద‌లుపెట్టాడు. ఆధ్యాత్మిక‌త‌, ప్ర‌పంచ శాంతి దిశ‌గా త‌న మ‌న‌సు మారిన‌ట్లు ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు చెప్పేవాడు.

త‌న స్వంత ఊళ్లో ఓ గుడిసెలో సూర‌జ్ పాల్ జీవించేవాడు. అయితే యూపీ అంత‌టా అత‌ను స‌త్సంగ్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఉండేవాడు. యూపీతో పాటు రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ ఆయ‌న‌కు ఫాలోయింగ్ ఉన్న‌ది. ఫాలోవ‌ర్లు ఇచ్చే డ‌బ్బును ఎప్పుడూ వారికే ఖ‌ర్చు చేస్తుంటాన‌ని అత‌ను స‌త్సంగ్‌ల‌లో చెపుతుంటారు.

భోలే బాబా మీడియాకు దూరంగా ఉంటాడు. కరోనా స‌మ‌యంలోనూ అత‌ను స‌త్సంగ్ నిర్వ‌హించి వివాదానానికి కార‌ణ‌మ‌య్యాడు. 50 మందికే అనుమ‌తి ఇస్తే 50వేల మంది ఆ మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు.

ద‌ర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు తొక్కిస‌లాట జ‌రిగిన ప్రాంతంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు.  అలీఘ‌డ్‌లోని ఏఎస్పీ అమృత్ జెయిన్ మాట్లాడుతూ.. హాథ్రాస్ జిల్లా నుంచి 38 మంది మృత‌దేహాలు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఆ 36 మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ పూర్తి అయిన త‌ర్వాత ఆ మృత‌దేహాల‌ను వారి వారి కుటుంబాల‌కు పంపిన‌ట్లు ఆయ‌న చెప్పారు. గుర్తు తెలియ‌ని మృత‌దేహాల ఫోటోల‌ను స‌మీప జిల్లాల‌కు పంపిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. హాథ్రాస్ తొక్కిస‌లాట ఘ‌ట‌న ప‌ట్ల సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని అల‌హాబాద్ హైకోర్టులో అడ్వ‌కేట్ గౌర‌వ్ ద్వివేది పిల్ దాఖ‌లు చేశారు.