తెలంగాణాలో 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష

213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మ‌గ్గుతున్న త‌మ కుటుంబ స‌భ్యుల‌ను విడుద‌ల చేయాలంటూ ఖైదీల కుటుంబ స‌భ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా పాల‌నలో ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గద‌ర్శకాల‌ ఆధారంగా ఖైదీల ముంద‌స్తు విడుద‌లకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించారు. 
 
ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించిన సీనియ‌ర్ అధికారులు, అర్హులైన వారి వివ‌రాల‌ను హైలెవ‌ల్ క‌మిటీ ముందుంచారు. హైలెవ‌ల్ క‌మిటీ విడుద‌ల‌కు అర్హులైన ఖైదీల జాబితాను కేబినెట్ ముందు ఉంచింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఖైదీల విడుద‌ల‌కు ఆమోద‌ముద్ర వేసింది. అనంత‌రం ఆ జాబితాకు గ‌వ‌ర్నర్ ఆమోద ముద్ర వేయ‌డంతో ఖైదీల ముంద‌స్తు విడుద‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈ ఉత్తర్వుల మేరకు చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు బుధ‌వారం విడుద‌ల కానున్నారు. వీరిలో 205 మంది యావ‌జ్జీవ శిక్ష ప‌డిన ఖైదీలు, ఎనిమిది మంది త‌క్కువ కాలం శిక్షప‌డిన వారు ఉన్నారు. వీరంద‌రికి జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన‌ నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చారు. మెరుగైన ప్రవ‌ర్తన ద్వారా సమాజంలో తిరిగి క‌లిసిపోవ‌డానికి వారంద‌రికీ కౌన్సెలింగ్ ఇప్పించారు.

ఖైదీలు ఒక్కొక్కరు రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని, ప్రతి 3 నెలలకు జిల్లా ప్రొబేషన్‌ అధికారి ముందు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. అలాగే జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్‌ కార్యాలయం సూచించినట్లు సమాచారం. జైళ్ల శాఖ నిర్వహిస్తోన్న పెట్రోల్‌ బంక్‌లు, ఇతర చోట్ల ఉపాధి కల్పించాలని సూచించింది.

బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల అయ్యే ఖైదీలను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్యమిశ్రా బుధవారం మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. సాధారణంగా ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేవారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ఖైదీలను సత్ప్రవర్తన కింద విడుదల చేశారు.

2016లో మొదటిసారిగా ఖైదీలను విడుదల చేయగా, రెండోసారి 2020 అక్టోబరు 2న 141 మందిని రిలీజ్ చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు పంపినా వివిధ కారణాలతో ఆమోదం లభించలేదు. 2024 జనవరిలో ఖైదీల విడుదలకు జైళ్ల శాఖ జాబితా సిద్ధం చేయగా, ఇప్పటికి మార్గం సుగమం అయ్యింది.