మూడోసారి ప్ర‌ధాని కావ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు

ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ చాలా అర్థ‌ర‌హిత‌మైన ప్ర‌సంగాన్ని చేసారని,  వ‌రుస‌గా మూడోసారి కాంగ్రేసేత‌ర పార్టీకి చెందిన నేత ప్ర‌ధాని కావ‌డాన్ని విప‌క్షాలు స‌హించ‌లేక‌పోతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. పార్ల‌మెంట్ నియ‌మావ‌ళి ప్ర‌కారం ఎలా స‌భ‌లో ప్ర‌వ‌ర్తించాల‌న్న విష‌యాన్ని ఆయ‌న ఎంపీల‌కు సూచించారు. ఉత్త‌మ విధానాలు పాటించేందుకు సీనియ‌ర్ల నుంచి నేర్చుకోవాల‌ని చెప్పారు.

పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు మాట్లాడుతూ పార్ల‌మెంట‌రీ స‌మ‌స్య‌లపై అధ్యయనం  చేయాల‌ని ప్ర‌ధాని సూచించిన‌ట్లు చెప్పారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అంశాల‌ను పార్ల‌మెంట్‌లో రెగ్యుల‌ర్‌గా ప్ర‌స్తావించాల‌ని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్ర‌సంగానికి కౌంట‌ర్ మోదీ ఇస్తార‌ని, ఆ సందేశం ప్రతి ఒక్క‌ర్నీ ఉద్దేశించి ఉంటుంద‌ని మంత్రి రిజిజు తెలిపారు.

పార్టీలతో సంబంధం లేకుండా దేశానికి సేవ చేయడం మన మొదటి బాధ్యతని, దేశానికి తొలి ప్రాధాన్యమిస్తూ పని చేయాలని ఎన్​డీఏ ఎంపీలకు హితోపదేశం చేశారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. 

మోదీ అ‍ధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. తమకు ప్రధాని చాలా ముఖ్యమైన మంత్రాన్ని ఉపదేశించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి ఎంపీ దేశానికి సేవ చేసేందుకు సభకు ఎన్నికయ్యారని, నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన అంశాలపై ఎంపీలు అవగాహన పెంచుకోవాలని మోదీ దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు.

మంచి ఎంపీగా ఎదగడానికి అవసరమైన పార్లమెంట్ నియమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రవర్తనను అనుసరించాలని ఎన్​డీఏ ఎంపీలను ప్రధాని మోదీ కోరారని కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు తెలిపారు. ప్రధాని మార్గ నిర్దేశనం ఎంపీలందరికీ, ప్రత్యేకించి తొలిసారి సభకు వచ్చిన సభ్యులకు ఒక మంచి మంత్రంగా తాము భావిస్తున్నామని చెప్పారు. ప్రధాని హితబోధ చేసిన మంత్రాన్ని తాము అనుసరించాలని నిర్ణయంచుకున్నామని వెల్లడించారు.

‘సీనియర్‌ ఎంపీల నుంచి పార్లమెంటరీ నియమాలు ప్రవర్తనను నేర్చుకోవాలని నూతన ఎంపీలకు మోదీ సూచించారు. తొలిసారిగా కాంగ్రెసేతర నేత మూడోసారి ప్రధాని కావడం వల్ల ప్రతిపక్షాలు కలత చెందాయని అన్నారు. పార్లమెంటరీ సమస్యలను అధ్యయనం చేయాలని, క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరు కావాలి. మీడియా ముందు సమస్యలను ప్రస్తావించే ముందు వాటిపై పూర్తిగా అధ్యయనం చేయాలి. ఎంపీలందరూ నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ టచ్‌లో ఉండాలి’ అని ప్రధాని మోదీ సూచనలు చేసినట్లు కిరణ్​ రిజిజు తెలిపారు.

ఎంపీలకు ప్రధాని మోదీ మరో విజ్ఞప్తి కూడా చేశారని కిరణ్‌ రిజిజు తెలిపారు. ప్రతి ఎంపీ తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించాలని మోదీ చెప్పారని వివరించారు. ప్రధానమంత్రి సంగ్రహాలయలో తొలి ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటి వరకు అందరూ ప్రధానుల ప్రస్థానం ఉందని వారి గురించి తెలుసుకోవాలని ఎంపీలకు మోదీ సూచించారని తెలిపారు. 
ఇందులో రాజకీయ అజెండా ఏమీ లేదని, ప్రతి ప్రధాని చేసిన కృషిని దేశం మొత్తం తెలుసుకోవడం, అభినందించడం, నేర్చుకోవడం వారికి నివాళులు అర్పించడం ఒక విధిలా భావించాలని మోదీ దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు.  మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన మోదీని ఎన్‌డీఏ నేతలు సన్మానించారు. 
 
పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్‌డీఏ సమావేశం జరిగింది. ఉభయ సభల్లో జరిగిన చర్చలకు ప్రధాని మోదీ సాయంత్రం సమాధానం చెప్పనున్నారు.