లఢక్ ప్రమాదంలో ముగ్గురు ఏపీ సైనికులు మృతి

తూర్పు లఢక్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో  ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. ఈ ముగ్గురు సైనికుల మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు. 
 
వాస్తవాధీన రేఖ సమీపంలో టి-72 యుద్ధ ట్యాంకులో వెళుతున్నప్పుడు లేహ్ కు 148 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మంచు కరిగి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతిచెందారు.
 
ఈ ప్రమాదంలోనే కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు (32) మరణించారు. ధనలక్ష్మి, వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల కిందట మంగాదేవితో పెళ్లైంది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు. 
 
బాపట్ల జిల్లా రేపల్లే మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఇతను 17 ఏండ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవాల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇస్లాంపూర్ లో సుమారు 100 ఇళ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు సైనికులు దేశానికి సేవలు అందించారు. వీరిలో కొందరు రిటైర్డ్ అయ్యారు.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన 52 ఆర్మర్డ్ రెజిమెంట్‌కు చెందిన వీర జవాన్లు రిసల్దార్ ముత్తుముల్ల ఆర్. కృష్ణా రెడ్డి, హవల్దార్ సుభాన్ ఖాన్, సిపాయి నాగరాజులకు ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తరపున గవర్నర్ ఏడీసీ మేజర్ దీపక్ శర్మ గన్నవరం విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు.

లడఖ్ లో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలుగు జవాన్లు సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీర జవాన్ల కుటుంబాలని ఆదుకుంటామని భరోసా కల్పించారు.

ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతి పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. లద్దాఖ్‌ ప్రమాదంలో సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్, ఎం. ఆర్కే రెడ్డి మృతి చెందటం బాధాకరం అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతిని చేకూరాలని, వారి కుటుబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు.

“లద్దాఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి” అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన  విజ్ఞప్తి చేశారు.