హిందువులపై రాహుల్ ఆరోపణలను ప్రజలు ఎప్పటికి క్షమించరు

హిందూమతంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రమైన విషయమని పేర్కొంటూ దాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం సాయంత్రం లోక్‌సభలో బదులిస్తూ హిందువులు హింసాత్మకులు అంటారు.. ఇవేనా మీ విలువలు? ఇదేనా మీ వ్యక్తిత్వం? ఇదేనా ఈ దేశ హిందువులపై మీకున్న ద్వేషం? అని ప్రశ్నించారు. 
 
ఈ దేశం శతాబ్దాల పాటు దీన్ని మర్చిపోదని చెబుతూ హిందూ మతాన్ని డెంగ్యూ, మలేరియా మొదలైనవాటితో పోల్చడానికి ప్రయత్నించిన వ్యక్తులు, నిన్నటి దృశ్యాల తర్వాత హిందువులు చప్పట్లు కొట్టాలి ఆలోచించండి – ఈ అవమానం యాదృచ్చికమా లేక డిజైన్‌లో భాగమా? అంటూ సూచించారు.
 
బిజెపిపై దాడి చేస్తూ “హిందువులమని చెప్పుకునే వారు హింస… ద్వేషం… 24 గంటలూ అసత్యం మాట్లాడతారు” అని గాంధీ సోమవారం సభలో దుమారం రేపారు. కాంగ్రెస్ అబద్ధాలను రాజకీయాలకు ఆయుధంగా మార్చుకుందని ప్రధాని  మోదీ ఆరోపించారు. ప్రతి మహిళకు నెలకు రూ.8,500 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్న కాంగ్రెస్‌ ప్రచార హామీని మోదీ ఎండగడుతూనే, ఈవీఎంలు, రాజ్యాంగం, రిజర్వేషన్‌లు, రాఫెల్‌, హెచ్‌ఏఎల్‌, ఎల్‌ఐసీ, బ్యాంకుల గురించి కాంగ్రెస్‌ అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు.
 
 “అగ్నివీర్‌పై సభకు అబద్ధాలు చెప్పారు. ఎంఎస్‌పిల గురించి కూడా అదే చెప్పారు. సభ గౌరవం దెబ్బతినడం సభ దురదృష్టం. 60 ఏళ్లుగా ఇక్కడ కూర్చుని ప్రభుత్వ పనితనం తెలిసిన పార్టీ – ఎప్పుడు అయోమయ మార్గాన్ని ఎంచుకుంటుంది. దేశం ప్రమాదకరమైన దిశలో పయనిస్తోందనడానికి ఇది రుజువు పొందింది” అంటూ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. 
 
 ఇది దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన మన స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమే అని ప్రధాని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి పథాన్ని ఎంచుకుంటున్నా కాంగ్రెస్ మాత్రం గందరగోళం చెలాయించడమే పనిగా పెట్టుకుందని మోదీ ధ్వజమెత్తారు.
 
“వారు దక్షిణాదిలో ఉత్తరాదికి వ్యతిరేకంగా, ఉత్తరాదిలో పశ్చిమానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మతం ఆధారంగా విభజించడానికి ప్రయత్నించారు. దేశ విభజనను సమర్థించిన వారికి ఎన్నికల టిక్కెట్లు కూడా ఇచ్చారు. వారు ఆర్థిక గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వారు దేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపుకు తీసుకువెళుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి పర్యావరణ వ్యవస్థ దీనిని ప్రోత్సహించింది. వారు దేశంలో అల్లర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు” అంటూ ప్రధాని తీవ్రంగా విరుచుకుపడ్డారు.
 
అందరికీ న్యాయం అందించడమే తమ మంత్రమని, ఎవరినీ బుజ్జగించబోమని ప్రధాని తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  ప్రజలు పరిపక్వతతో కూడిన తీర్పు ఇచ్చారని అంటూ దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని భరోసా వ్యక్తం చేశారు. అబద్ధాలతో మభ్యపెట్టాలని చూసిన వారిని ప్రజలు ఓడించారని,  పదేళ్ల పాలన చూసి తమకు మరోసారి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. 
 
గత పదేళ్ల ప్రభుత్వంలో 25 కోట్ల మంది పేదలకు దారిద్య్రం నుంచి విముక్తి కల్పించామని, అవినీతిరహిత పాలన అందించామని మోదీ చెప్పారు.
ప్రజలు తమ పాలన, ట్రాక్‌ రికార్డు చూశారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దశాబ్ధంలో భారత్‌ ఖ్యాతి పెరిగిందని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ భారత్‌ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్ధానం సాగుతుందని స్పష్టం చేశారు. 
 
నేషన్‌ ఫస్ట్‌ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సభలో నిన్న, ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారని, వీరిలో కొందరు తొలిసారి ఎంపీలు అయినవారు కూడా ఉన్నారని తెలిపారు. వీరు పార్లమెంట్‌ నిబంధనలను అనుసరిస్తూ అనుభవం కలిగిన పార్లమెంటేరియన్లలా వ్యవహరించడం సంతోషకరమని చెప్పారు.
 
వీరు తొలిసారి చట్టసభలకు ఎన్నికైన సభ హుందాతనాన్ని పెంచేలా ప్రవర్తించారని ప్రశంసించారు. వారి అభిప్రాయాలతో చర్చను మరింత ఫలప్రదం చేశారని పేర్కొన్నారు. లౌకిక వాదం అంటే సామాజిక న్యాయం పాటించడమని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు తమపై భరోసా ఉంచారని పేర్కొంటూ  వికసిత్‌ భారత్‌తో ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పధకాలు సామాన్యులకు చేరుతున్నాయని చెప్పారు.ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు

ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు. మణిపూర్‌, నీట్ అంశాలపై మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. మోదీ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. విపక్ష సభ్యుల తీరుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను వెల్‌లోకి పంపేలా విపక్ష నేతలు వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు